Mudragada Padmanabham: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.. ఇదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని తేల్చేశారు. అయతే, ఎన్నికల పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ-జనసేన.. సీట్ల పంపకాలపై దృష్టి సారించాయి.. రెండు పార్టీల అధినేతలు పలు దఫాలుగా సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే, ముద్రగడ పద్మనాభం ఇంకా జనసేనలో చేరకముందే.. ఆయనను ఏ స్థానం నుంచి బరిలోకి దింపాలనే ఆలోచన ఇరు పార్టీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.. కాకినాడ సిటీ నుంచి ముద్రగడను పోటీ చేయించాలని జనసేనకి సూచించాలని కాకినాడ జిల్లా టీడీపీ నేతలు ఆలోచనలో ఉన్నారట.
కాకినాడ నుంచి వైసీపీ నుంచి బరిలోకి దిగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడించాలంటే ముద్రగడ పద్మనాభమే సరైన ప్రత్యర్థి అని జిల్లా టీడీపీ నేతల అభిప్రాయంగా ఉందని తెలుస్తోంది. నియోజకవర్గంలో కాపు, ఫిషర్మెన్ ఓట్లు అధికంగా ఉన్నరాయి.. ప్రస్తుతం మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వనమాడి కొండబాబు టీడీపీ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. మరోవైపు.. ముద్రగడ, ద్వారంపూడి కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి.. ఈ ప్రతిపాదను ముద్రగడ ముందు పెడితే ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మరోవైపు.. త్వరలోనే కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లలనున్నారు.. ముద్రగడను జనసేన పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అయితే, పవన్ కల్యాణ్ వచ్చినప్పుడే.. టీడీపీ-జనసేన కూటమి తరుపున కాకినాడ సిటీ నుంచి ముద్రగడ పోటీ చేసే విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లాలనే ఆలోచనలో టీడీపీ నేతలు ఉన్నట్టుగా తెలుస్తోంది.