ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. ‘తెలంగాణ రాష్ట్రంలో గత 13 రోజుల నుంచి పంచాయితీ కార్యదర్శులు సమ్మె చేస్తున్నారు…వీరి సమ్మె వలన గ్రామాల్లో అభివృద్ధి అడుగంటి పోయింది.. 2018 నూతన పంచాయితీరాజ్ చట్టం మేరకు గ్రామాల అభివృద్ధి కోసం మూడేళ్ల ప్రొబేషన్ పీరియడ్ తో 2019 ఏప్రిల్ 12న 9,355 మంది పంచాయితీ కార్యదర్శులుగా నియమించి పలు రకాల షరతులతో వారిచేత 100 బాండ్ పేపర్ మీద సంతకాలు తీసుకొని ఉద్యోగాల్లోకి నియమించారు.. వారి మూడేళ్ల ప్రొబేషనరీ పీరియడ్ 2022, ఏప్రిల్ 11న పూర్తైంది..వారిని రెగ్యులర్ చేయకపోగా, ప్రొబేషనరీ పీరియడ్ ను మరో ఏడాది పెంచుతున్నట్లు మీరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటన చేసి, ఆ వెంటనే జూలై 17న జీవో నెంబర్ 26ను విడుదల చేశారు..మీరు పొడిగించిన మరొక ఏడాది ప్రొబేషన్ పీరియడ్ కూడా ఈ ఏప్రిల్ 11తో ముగిసింది…అయినప్పటికీ వీరి రెగ్యులరైజేషన్ గురించి ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దిక్కులేని పరిస్థితుల్లో పంచాయితీ కార్యదర్శులు సమ్మెకు దిగారు.. వారివి అన్ని న్యాయపరమైన డిమాండ్లే…తక్షణమే వారికి మీరిచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి..
Also Read : Robert De Niro: 79 ఏళ్ళ వయసులో… రాబర్ట్ డి నీరోకు అదేం పని!
సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వమే సమ్మె విరమించి ఉద్యోగాల్లో చేరకుంటే వారిని విధుల్లో తొలగిస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారు.. గ్రామపంచాయతీ పరిధిలో 56 రకాల విధులు, 42కు పైగా రికార్డుల బాధ్యతలను వారు నిర్వర్తిస్తున్నారు.. రోజుకు 12 గంటలపాటు పనిభారంతో జూనియర్ పంచాయితీ కార్యదర్శులు సతమతమవుతున్నారు.. వారికి పనికి మించి బాధ్యతలు అప్పగించడంతో పంచాయితీ కార్యదర్శులు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడ్డారు…మరికొద్ది మంది ఒత్తిడికి తట్టుకోలేక రాష్ట్రంలో 1500 ఉద్యోగాలు వదిలేశారు… ఇతర అనారోగ్య సమస్యలతో 44 మంది వరకు మృతి చెందారు. ఇంత చేస్తున్న మీ ప్రభుత్వం గ్రామ కార్యదర్శుల రెగ్యులర్ చేసే విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం లేదు. ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థానంలో నిలవాలనే ఆశ ఉన్నప్పటికీ తక్కువ జీతమే అయిన వచ్చిన ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వదలుకోకూడదని జూనియర్ పంచాయితీ కార్యదర్శి ఉద్యోగంలో చేరారు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే రాష్ట్రంలో పాలన ఉన్నట్టా లేనట్టా! ఇప్పటికైనా పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాల్సిన బాధ్యత మీపైన ఉంది. లేనిపక్షంలో వారి పోరాటానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలవడమే కాక… వారి తరపున ప్రత్యక్ష కార్యచరణకు సైతం సిద్ధమవుతాం.’ అని ఉత్తమ్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.
డిమాండ్లు :
• జూనియర్ పంచాయితీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్ చేయాలి…
• 2019 ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు వారుచేసిన పనికాలాన్ని సర్వీసుగా పరిగణించాలి..
• చని పోయిన పంచాయితీ కార్యదర్శుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించేలా కారుణ్య నియామకాలు చేపట్టాలి.
• OPS (Out Sourcing Secretary) వారిని కూడా రెగ్యులర్ చేయాలి.
• మహిళా పంచాయితీ కార్యదర్శులకు 6 నెలల ప్రసూతి సెలవులు, 90 రోజుల చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలి.