ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న విలక్షణ నటుడు రాబర్ట్ డి నీరో ఏదో విధంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటారు. ‘గాడ్ ఫాదర్-2’తో ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్’గానూ, ‘రేజింగ్ బుల్’తో బెస్ట్ యాక్టర్ గానూ ఆస్కార్ అవార్డులు అందుకున్న రాబర్ట్ డి నీరో ఆ పై కూడా విలక్షణమైన పాత్రల్లో అలరించారు. ప్రస్తుతం డి నీరో వయసు 79 ఏళ్ళు. ఈ వయసులోనూ రాబర్ట్ డి నీరో ఓ బిడ్డకు తండ్రి కావడం ఇప్పుడు హాలీవుడ్ లో ఓ చర్చగా మారింది. ఆయన అభిమానులు, పలువురు సినీజనం రాబర్ట్ కు అభినందనలు తెలుపుతున్నారు. ఈ బిడ్డతో ఆయన మొత్తం ఏడుగురు పిల్లలకు తండ్రి అయ్యారన్నమాట. ఈ విషయాన్ని రాబర్ట్ సైతం ముసిముసిగా నవ్వుతూ అంగీకరించారు.
రాబర్ట్ డి నీరో నటననే కాదు, ఆయన జీవితమూ విలక్షణమైనదే. 1976లో డయాన్నే అబ్బాట్ అనే నటిని పెళ్ళాడారు. ఓ పుష్కరకాలం కాపురం చేశాక, 1988లో ఆమెకు టాటా చెప్పేశారు డి నీరో. ఆమె ద్వారా రాబర్ట్ కు ఇద్దరు పిల్లలు. 1997లో గ్రేస్ హైటవర్ అనే నటిని వివాహమాడారు రాబర్ట్. ఆమె నుండి 2018లో విడిపోయారు. ఈమెతోనూ రాబర్ట్ కు ఇద్దరు పిల్లలు. ఆ తరువాత గర్ల్ ఫ్రెండ్స్ తోనే కాపురం చేస్తూ మరో ఇద్దరిని తన సంతానంలో చేర్చుకున్నారు. రాబర్ట్ డి నీరో తాజా ప్రియురాలు టిఫ్ఫనీ చాన్ ఈ మధ్య గర్భవతిలా కనిపించింది. బహుశా, ఆమె ద్వారానే రాబర్ట్ తన ఏడో సంతానం పొందారేమో అని హాలీవుడ్ జనం అంటున్నారు. రాబర్ట్ డి నీరో మాత్రం తన ఏడవ బిడ్డకు తల్లి ఎవరో బయట పెట్టలేదు. ఏది ఏమైనా 79 ఏళ్ళ వయసులో తాను తండ్రి అయినందుకు గర్వంగానే ఫీలవుతున్నారాయన.