DMK Shocks to CM KCR ahead of Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారాన్ని దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)కు బిగ్ షాక్ తగిలింది. నవంబర్ 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని.. తెలంగాణలోని డీఎంకే శ్రేణులు, మద్దతుదారులకు ఆ పార్టీ పిలుపునిచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని డీఎంకే ఒక ప్రకటనలో వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్ధులు భారీ మెజారిటీతో విజయం సాధించేలా పని చేయాలని పార్టీ కోరింది. తమిళనాడులో కాంగ్రెస్‌కు డీఎంకే మిత్రపక్షం. గత ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని సర్కార్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసిన ఇండియా కూటమిలో డీఎంకే ఉన్న విషయం తెలిసిందే.
Also Read: Venkatesh Iyer Engagement: టీమిండియా క్రికెటర్ ఎంగేజ్‌మెంట్.. ఫొటోస్ వైరల్!
బీజేపీకి వ్యతిరేకంగా ఫ్రంట్ ఏర్పాటు విషయంలో పలు రాష్ట్రాల సీఎంలను.. ఆయా ప్రాంతీయ, జాతీయ పార్టీల నేతలను తెలంగాణ సీఎం కేసీఆర్ కలిశారు. ఈ క్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌తో కూడ కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో డీఎంకే భాగస్వామిగా ఉంది. దాంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డీఎంకే తన మద్దతు తెలిపింది. మరోవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కానీ.. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కానీ బీఆర్‌ఎస్ భాగస్వామిగా లేదు.