సినీ నటుడు పోసాని కృష్ణమురళికి తృటిలో ప్రమాదం తప్పింది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ వద్ద జీపు దిగి లోపలికి వెళుతూ ఉండగా.. అకస్మాత్తుగా డ్రైవర్ జీపును ముందుకు కదిలించాడు. జీపు తగిలి పోసాని త్రూలి పడబోయారు. పక్కనే ఉన్న పోలీసులు ఆయనను పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. పోసాని సహా పోలీసు అధికారులు డ్రైవర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన అనంతరం పోసాని ఓబులవారిపల్లె పీఎస్‌లోకి వెళ్లిపోయారు.
ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లోనే ప్రభుత్వ వైద్యుడు గురు మహేశ్ ఆధ్వర్యంలో పోసాని కృష్ణమురళికి వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ స్టేట్‌మెంట్‌ను రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. పోసానిని కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశముంది. బుధవారం రాత్రి రాయదుర్గంలోని మైహోమ్ భూజాలో పోసానిని ఓబులవారిపల్లె పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్ సహా వారి కుటుంబాలపై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన నేత జోగినేని మణి ఓబులవారిపల్లె పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. మణి ఫిర్యాదు మేరకు పోసానిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.
పోసాని కృష్ణమురళిపై పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఉంటారని రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అనుమానం వ్యక్తం చేశారు. పోసాని తమకు చూపించాలంటూ తన అనుచరులతో కలిసి ఓబులవారిపల్లి పోలీస్ గేటు వద్దకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యేని పోలీసులు అడ్డుకున్నారు. పోసానిని చూపించాలంటూ పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. విచారణ ఇంకా పూర్తి కాలేదని, విచారణ అనంతరం మాట్లాడిస్తామంటూ పోలీసులు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీంతో శాంతించిన ఆయన పోలీస్ స్టేషన్ వద్ద నుంచి తను అనుచరులతో వెళ్లిపోయారు.