KTR: పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఆశించిన ఫలితం రాలేదన్న ఆయన.. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామన్నారు. 39 స్థానాలతో ప్రతిపక్ష పాత్రను పోషించాలని ప్రజలు చెప్పారని.. ప్రజలు అందించిన తీర్పును శిరసావహిస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ అనేక ఎత్తుపల్లాలను చవిచూసిందని.. అనుకున్న తెలంగాణను సాధించామన్నారు. 39 సీట్లు కార్యకర్తల శ్రమతోనే వచ్చాయని కేటీఆర్ వెల్లడించారు. ప్రజల పక్షాన, ప్రజల గొంతుకగా పని చేస్తామన్నారు. ప్రభుత్వం నడిపే వారు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు. రాజకీయాల్లో సహనం అవసరమని.. ప్రజల మన్నన పొందే విధంగా బీఆర్ఎస్ పార్టీ పని చేస్తుందన్నారు.
Read Also: Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీకి 15 మంది వైద్యులు ఎన్నిక
రాజకీయాల్లో గెలుపు,ఓటములు సహజమని.. గెలిచిన కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బందిపెట్టమని, వారికి సమయం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అధైర్యపడవద్దని ఆయన సూచించారు. హైదరాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడిందన్నారు. ఈ ఓటమి చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని.. కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసి పూర్వ వైభవం సాధిద్దామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రతి జిల్లాలో ప్రజలు ప్రాతినిధ్యం కల్పించారన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా కేసీఆర్ రాజీనామా లేఖను గవర్నర్‌కు పంపారన్నారు.