తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నేడు పాలేరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఖమ్మం నేతలపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులపై ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరిన వాళ్లు చేస్తున్న విమర్శలకు కేసీఆర్ పాలేరు వేదికగానే కౌంటర్ ఎటాక్ చేశారు. నరం లేని నాలుక ఎన్నయినా మాట్లాడుతుంది.. నిన్నటి వరకు కేసీఆర్ వల్లే ఖమ్మంకు మోక్షం కలిగిందని పొగిడిన వాళ్లే.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయని కేసీఆర్ ధ్వజమెత్తారు.
Read Also: Sankranthi 2024 Movies: సంక్రాంతి బరిలో స్టార్ హీరో మూవీ.. కష్టమే బాసూ..
అయితే, తుమ్మల నాగేశ్వరరావు పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయాడు.. తుమ్మల ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చా.. మళ్లీ ఉపఎన్నికల్లో గెలిపించుకున్నాం.. 5 ఏళ్లు జిల్లాను ఆయనకు అప్పగిస్తే ఆయన చేసింది గుండు సున్నా అంటూ కేసీఆర్ విమర్శలు గుప్పించారు. తుమ్మలకు బీఆర్ఎస్ అన్యాయం చేసిందా.. లేక తుమ్మల బీఆర్ఎస్‌కు అన్యాయం చేశారా?.. అని సీఎం కేసీఆర్ అడిగారు. పదవుల కోసం పార్టీలు మారే మన మధ్యే ఉన్నారని.. వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని చెప్పుకొచ్చారు. డబ్బు, అహంకారంతో వచ్చే వాళ్లకు ఛాన్స్ ఇవ్వొద్దన్నారు. ఆవకాశం ఇస్తే వాళ్లు గెలుస్తారు.. కానీ ప్రజలు ఓడిపోతారని కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా ఉద్యమాల గడ్డ, ఈ జిల్లా ప్రజలు చైత్యనవంతులు.. మద్యం, డబ్బుతో వచ్చే వారికి ఓటు వేయకుండా.. పార్టీల వైఖరిని పరిశీలించి ఓటు వేయాలని బీఆర్ఎస్ అధినేత సూచించారు.