Kakarla Suresh: ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ ఆఫీసులో బుధవారం దుత్తలూరు, వరికుంటపాడు మండలాల ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో నెల్లూరు ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్ రెడ్డి, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ కొట్టే వెంకటేశ్వర్లు, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి రంగారావు, జనసేన, బీజేపీ నేతలు హాజరయ్యారు.
Read Also: Kakarla Suresh: ఉదయగిరి కోటపై తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయం
ఈ సందర్భంగా వేరువేరుగా జరిగిన సమీక్ష సమావేశంలో వరికుంటపాడు మండల కన్వీనర్ చండ్రా మధుసూదన్ నాయుడు మండల నాయకులను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, కాకర్ల సురేష్‌కు పరిచయం చేశారు. అనంతరం వారు ఎదుర్కొంటున్న సమస్యలను క్లుప్తంగా విన్నారు. అదేవిధంగా దుత్తలూరు మండల కన్వీనర్ వెంకటరత్నం దుత్తలూరు మండల నాయకులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వేదిక దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం అతిధులు మాట్లాడుతూ.. చిన్నచిన్న విభేదాలు సహజమని వాటన్నిటిని పక్కనపెట్టి తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందన్నారు. పార్టీ నీడలో ఉంటూ పార్టీకి ద్రోహం చేస్తే సహించేది లేదన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు అదేవిధంగా బాబు సూరిటీ భవిష్యత్ గ్యారెంటీ గురించి వివరించాలన్నారు. మహా యుద్ధంలో సైనికులు లాగా పనిచేస్తేనే విజయం వరిస్తుందన్నారు. ఎన్నికలవేళ నిర్లక్ష్యం తగదు అని తెలిపారు. మీకు కావాల్సిన సౌకర్యాలు అన్ని సమకూరుస్తానని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని కాకర్ల సురేష్ తెలిపారు.
సమస్యలతో తన దగ్గరికి వచ్చే వారికి పరిష్కారం దొరుకుతుందని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. కనుక ఈ నెలరోజుల కష్టపడి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. అలా చేసుకుంటేనే మనందరికీ భవిష్యత్తు అన్నారు. అదే విధంగా నెల్లూరు ఎంపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాకర్ల సురేష్ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ముందుగా దుత్తలూరుకు చెందిన పలువురు వైసీపీ నాయకులు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కాకర్ల సురేష్ తెలుగుదేశం కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.