చంద్రబాబు- పవన్ కళ్యాణ్ సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చాయి. అయితే, ఈ మీటింగ్ లో మినీ మేనిఫెస్టో ప్రకటిద్దామా..? లేక పూర్తి స్థాయి ప్రకటిద్దామా..? అనే అంశంపై తర్జన భర్జన కొనసాగింది. దసరా నాటికి పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటించాల్సి ఉందన్న చంద్రబాబు.. కానీ, జైల్లో ఉన్న కారణంగా ప్రకటించలేకపోయామని ఆయన పేర్కొన్నారు. కొంచెం ఆలస్యమైనా పూర్తి స్థాయి మేనిఫెస్టోను ప్రకటిద్దామనే నిర్ణయానికి చంద్రబాబు – పవన్ వచ్చారు. జనసేన వైపు నుంచి మేనిఫెస్టో రూపకల్పన కోసం ఆరు అంశాలను ప్రతిపాదన చేశారు. త్వరలోనే మరోసారి భేటీ కావాలని బాబు – పవన్ నిర్ణయం తీసుకున్నారు.
ఇక, ఉమ్మడి మేనిఫెస్టో కోసం షణ్ముఖ వ్యూహం పేరిట 6 అంశాలను జనసేన పార్టీ ప్రతిపాదించింది. సంపన్న ఆంధ్రప్రదేశ్ పేరిట వివిధ రంగాలకు ఆర్ధిక ప్రోత్సాహం ఇస్తూ పారిశ్రామికంగా- ఉద్యోగాల కల్పన దిశగా అభివృద్ధి చేసే ప్రణాళిక.. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూ విశాఖ, తిరుపతి, విజయవాడలను క్లస్టర్ల వారీగా మహా నగరాలుగా అభివృద్ధి చేసేలా నిర్ణయం తీసుకున్నారు. బీపీఎల్ కుటుంబాలు ఇళ్లు కట్టుకోవాలన్నా, లేక ఇళ్ల మరమ్మతులకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయాలా అనేది దానిపై మరోసారి చర్చించనున్నారు.
1. దాదాపు 30 లక్షల భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఇచ్చేలా కార్యాచరణ.
2. సౌభాగ్య పథకం పేరిట ఏటా లక్ష మంది యువ పారిశ్రామిక వేత్తలకు చిరు వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు నడుపుకునేలా రూ.10లక్షల చొప్పున సాయం.
3. వ్యవసాయం – బంగారు ఫలసాయం పేరిట ఉద్యాన రైతులకు రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు.
4. ఉద్యాన పంటలు పండే ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు.
5. మైనర్ ఇరిగేషన్ రంగాన్ని ప్రోత్సహాం.. ఇబ్బందుల్లేని వ్యవసాయం.
6. మన ఏపీ మన ఉద్యోగాలు పేరిట ప్రతీ ఏటా ఏపీపీఎస్సీ ద్వారా సకాలంలో పోస్టుల భర్తీ.. ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు.. సీపీఎస్ రద్దు చేసి పాత ఫించన్ విధానం అమలు చేసే పలు అంశాలను జనసేన ప్రతిపాదించింది.