ఐపీఎల్ 2025 మెగా వేలం డేట్స్ వచ్చేశాయి. ఈ నెల 24, 25వ తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో వేలం జరగనుంది. నవంబర్ 4తో ఆటగాళ్ల నమోదు ప్రక్రియ అధికారికంగా ముగిసింది. మొత్తం 1,574 మంది ప్లేయర్స్ వేలం కోసం పేర్లు నమోదు చేసుకున్నారు. అంతకుముందు అక్టోబర్ 31న రిటెన్షన్ జాబితాకు గడువు ముగియగా.. 10 ప్రాంఛైజీలు తమ లిస్ట్ ప్రకటించాయి. ఢిల్లీ క్యాపిటల్స్ తమ కెప్టెన్ రిషబ్ పంత్‌ను వేలంలోకి వదిలేసింది. మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన విభేదాల కారణంగానే పంత్ ఢిల్లీని వీడినట్లు తెలుస్తోంది.
రిషబ్ పంత్ 2016 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. 2022లో ఢిల్లీకి కెప్టెన్ అయిన పంత్.. గాయం కారణంగా 2023లో ఆడలేదు. 2024లో మరలా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే ప్లే ఆఫ్స్ మాత్రం చేరలేదు. దాంతో పంత్‌ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించాలనుకుంది. కెప్టెన్సీ లేకుండా ఆటగాడిగా కొనసాగేందుకు పంత్ ఒప్పుకోకపోవడంతో.. ఢిల్లీ మేనేజ్‌మెంట్ అతడిని వేలంలోకి వదిలేసింది. ఇప్పుడు అతడిపై మూడు టాప్ టీమ్స్ కన్నేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు కెప్టెన్సీ ఆఫర్ ఇస్తూ.. భారీ ధర ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయట.
Also Read: IPL Auction 2025: జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం.. పేర్లు నమోదు చేసుకున్న 1574 మంది క్రికెటర్లు!
రిషబ్ పంత్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్‌సీబీ ముందువరుసలో ఉందట. ఆర్‌సీబీకి ఇప్పుడు కెప్టెన్‌తో పాటు వికెట్ కీపర్ కూడా కావాలి. అణుడికే పంత్‌ను కొనుగోలు చేస్తే.. ఈ రెండింటినీ భర్తీ చేయవచ్చని ఆర్‌సీబీ భావిస్తోంది. పంత్ కోసం రూ.25 కోట్ల వరకు వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. పంత్ కోసం పంజాబ్ కూడా పోటీ పడనుందని తెలుస్తోంది. ఆర్‌సీబీ మాదిరి పంజాబ్‌కు కూడా కెప్టెన్, వికెట్ కీపర్ అవసరం ఉంది. అందుకే పంత్ కోసం రూ.30-40 కోట్ల వరకు ఖర్చు పెట్టేందుకు రెడీగా ఉందట. చెన్నై కూడా పంత్ కోసం పోటీ పడనుందని తెలుస్తోంది. ఎంఎస్ ధోనీ స్థానాన్ని పంత్‌తో భర్తీ చేయాలని భావిస్తోందట.