Ind vs SL: తొలి వన్డేలో అద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకుని జోరుమీదున్న టీమిండియా నేడు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో రెండో వన్డేలో శ్రీలంకతో తలపడనుంది. గెలుపే లక్ష్యంగా ఇరుజట్లు బరిలోకి దిగుతున్నాయి. బ్యాటర్లు విరుచుకుపడడంతో తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి మళ్లీ అదే ప్రదర్శనను కనబరచాలని టీమిండియా భావిస్తుండగా.. సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితి లంకది. భారత జట్టు ఫామ్‌ను చూస్తే బలంగా ఉంది. భారత జట్టును ఎదుర్కోవాలంటే లంక జట్టు సర్వశక్తులు ఒడ్డాల్సిందే. లంకజట్టు సమష్టి బాధ్యత కనబరిస్తేనే భారత జట్టును ఢీకొంటుంది. లేకుంటే గత మ్యాచ్ ఫలితం పునరావృతమైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను పట్టేయాలని టీమిండియా భావిస్తోంది.
మొదటి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఫామ్‌లో ఉండడం భారత్‌కు కలిసొచ్చే అంశం. తొలి వన్డేలో బ్యాటుతో అదరగొట్టిన కోహ్లీ 73వ అంతర్జాతీయ శతకంతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. టాపార్డర్‌లో ముగ్గురు బ్యాటర్‌లో తమ బ్యాట్‌తో సమాధానం చెప్తే భారత్ విజయం నల్లేరుపై నడకే అని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు. భారత టాపార్డర్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, యువ ఓపెనర్ శుభమన్ గిల్ వన్డే ఫామ్‌ను కొనసాగిస్తుండడంతో భారత్ టాప్ ఆర్డర్ కుదురుకున్నట్లే కనిపిస్తోంది. ఇక గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన కెప్టెన్ రోహిత్ తన మ్యాచ్ ఫిట్‌నెస్‌పై సందేహాలను పటాపంచలు చేశాడు. ఇప్పుడు తన ఫేవరెట్ మైదానం ఈడెన్ గార్డెన్స్‌లో చెలరేగేందుకు ఉత్సాహంగా సిద్ధమయ్యాడు. బౌలింగ్‌లోనూ భారత్ ధీమాగానే కనిపిస్తోంది. బౌలర్లు మహ్మద్ సిరాజ్, షమి, ఉమ్రాన్ మాలిక్‌లు లంక బ్యాటర్లకు సమస్యలు సృష్టిస్తారని జట్టు ఆశిస్తోంది. భారత్ ఎలాంటి మార్పులు లేకుండా రెండో వన్డేలో బరిలోకి దిగే అవకాశముంది. కోల్‌కతాలో స్పిన్నర్లకు అవకాశం ఉండటంతో చాహల్, అక్షర్ కూడా ప్రభావం చూపుతారు.
Cough Syrups: ఉజ్బెకిస్తాన్‌లో ఈ భారతీయ దగ్గు సిరప్‌లను ఉపయోగించొద్దు.. డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు
మంచి ఫామ్‌లో ఉన్న టీమిండియాను అడ్డుకోవాలంటే శ్రీలంక అసాధారణంగా ఆడాల్సిందే. టాపార్డర్‌లో నిసాంక మాత్రమే నిలకడగా ఆడుతున్నాడు. షనక కెప్టెన్ ఇన్నింగ్స్‌తో రాణిస్తున్నాడు. వీరితో పాటు ఫెర్నాండో, కుశాల్ మెండిస్‌లు కూడా రాణిస్తేనే భారీస్కోరు చేయగలుగుతుంది. ఈ మ్యాచ్‌తోనే సిరీస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్న రోహిత్‌సేనను అడ్డుకోవడం లంకేయులకు సవాలే.