BrahMos 800km Missile: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇదే సమయంలో భారత్.. పాకిస్థాన్‌కు అదిరిపోయే దీపావళి షాక్ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత నుంచి భారత సైన్యం తన సామర్థ్యాలను మరింత బలోపేతం చేసుకుంటుంది. తాజాగా సైన్యం కొత్త ప్రకటన విడుదల చేసింది.. రాబోయే రెండేళ్లలో సైన్యంలోకి 800 కిలోమీటర్ల పరిధి కలిగిన కొత్త బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి చేరనుంది. ఈ క్షిపణి 2027 చివరి నాటికి పూర్తిగా పనిచేయనుందని రక్షణ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే 200 కిలోమీటర్లకు పైగా పరిధి కలిగిన ఆస్ట్రా ఎయిర్-టు-ఎయిర్ క్షిపణి కూడా 2026-27లో ఉత్పత్తికి సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
READ ALSO: K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు
బ్రహ్మోస్ కొత్త వెర్షన్..
భారతదేశం వద్ద ఇప్పటికే అత్యంత ప్రాణాంతక ఆయుధాలలో ఒకటిగా బ్రహ్మోస్ క్షిపణి ఉంది. ఇది గంటకు 3424 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది, ఇది ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రస్తుతం దీని పరిధి 450 కిలోమీటర్లు. అయితే దీని కొత్త వెర్షన్ ఇప్పుడు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువులను లక్ష్యంగా చేసుకోగలదని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. 800 కిలోమీటర్ల బ్రహ్మోస్ కోసం రామ్‌జెట్ ఇంజిన్ ఇప్పటికే దాదాపు సిద్ధంగా ఉందని సమాచారం. దీన్ని మరింత పటిష్టం చేయడానికి ప్రస్తుతం అదనపు పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు క్షిపణి అంతర్గత INS (ఇనర్షియల్ నావిగేషన్ సిస్టమ్), బాహ్య GNSS (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) అనుకూలతను ధృవీకరిస్తున్నాయి. క్షిపణి స్థిరంగా దాని లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా, జామింగ్‌ను నిరోధించేలా, దృఢంగా ఉండేలా చూసుకోవడమే ప్రస్తుత పరీక్షల లక్ష్యం.
ఈ పరీక్షలు విజయవంతమైతే క్షిపణి పూర్తిగా సిద్ధంగా అయినట్లే. ఇది సైన్యంలోకి వస్తే.. నావికాదళం తన యుద్ధనౌకలలో ఇప్పటికే మోహరించిన 450 కిలోమీటర్ల బ్రహ్మోస్ క్షిపణిని 800 కిలోమీటర్ల పరిధికి అప్‌గ్రేడ్ చేస్తారు. వాస్తవానికి ఈ అప్‌గ్రేడ్‌లో పెద్ద మార్పులు అవసరం లేదని చెబుతున్నారు. సాఫ్ట్‌వేర్, ఫైర్ కంట్రోల్ సిస్టమ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్ (GUI), కొన్ని చిన్న మార్పులు మాత్రమే సరిపోతాయని సమాచారం. క్షిపణి, దాని లాంచర్ ప్రాథమిక రూపకల్పన రెండింటికి ఒకేలా ఉంటుందని నిఘా వర్గాలు తెలిపాయి. 800 కిలోమీటర్ల బ్రహ్మోస్‌ను మొదట నేవీ, ఆర్మీకి అందుబాటులోకి రానున్నాయి. ఎందుకంటే ఇవి ఈ క్షిపణిని ఆపరేట్ చేయడం సులభం. ఎయిర్-లాంచ్ వెర్షన్‌కు కొంచెం ఎక్కువ సమయం పడుతుందని నిఘా వర్గాలు తెలిపాయి.
బిగ్ బ్రహ్మోస్ డీల్స్
భారత్-రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్‌తో ఇప్పటివరకు ₹58 వేల కోట్లకు పైగా విలువైన ఒప్పందాలపై సంతకం చేసింది. రూ.19,519 కోట్ల విలువైన అతిపెద్ద ఒప్పందం మార్చి 2024లో సంతకం చేశారు. ఇందులో నేవీ కోసం 220కి పైగా బ్రహ్మోస్ క్షిపణుల కొనుగోలు కూడా ఉంది. కొత్త డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్‌లతో సహా దాదాపు 20 యుద్ధనౌకలు ఇప్పుడు ఈ క్షిపణులతో అమర్చనున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఆగస్టు 2025లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ దాదాపు రూ.10,800 కోట్ల వ్యయంతో వైమానిక దళం కోసం 110 గాలి నుంచి ప్రయోగించగల బ్రహ్మోస్ క్షిపణులకు ప్రాథమిక ఆమోదం లభించింది.
అలాగే ఆస్ట్రా మార్క్-2 క్షిపణి పరిధిని 160 కి.మీ నుంచి 200 కి.మీ.కు పెంచడానికి DRDO కృషి చేస్తోంది. వైమానిక దళం ఇప్పటికే 280కి పైగా ఆస్ట్రా మార్క్-1 క్షిపణులను (100 కి.మీ. పరిధి) కొనుగోలు చేసింది. ఆస్ట్రా మార్క్-2 కోసం మరికొన్ని వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఇది మరింత థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది, అలాగే ఎక్కువ బర్న్ సమయాన్ని అందిస్తుంది. పరీక్షలు విజయవంతమైతే ఆరు నెలల్లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. లేదంటే మరికొంత ఎక్కువ సమయం పడుతుంది. వైమానిక దళం మొదట్లో సుఖోయ్-30MKI, తేజస్ విమానాల కోసం 700 ఆస్ట్రా మార్క్-2 క్షిపణులను కొనుగోలు చేయాలని ప్రణాళిక రచిస్తుంది. భవిష్యత్తులో ఆస్ట్రా మార్క్-3 ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇందులో ఘన-ఇంధన డక్టెడ్ రామ్‌జెట్ (SFDR) ప్రొపల్షన్ ఉంటుంది. దీని పరిధి 350 కిలోమీటర్లు ఉండనున్నట్లు సమాచారం. కానీ ఇది మూడు ఏళ్లలో సైన్యానికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆస్ట్రా సిరీస్ క్షిపణులు పగలు, రాత్రి అన్ని వాతావరణ కార్యకలాపాలలోను పని చేయగలవు. ప్రస్తుతం దిగుమతి చేసుకుంటున్న ఖరీదైన రష్యన్, ఫ్రెంచ్, ఇజ్రాయెల్ BVR (బియాండ్ విజువల్ రేంజ్) క్షిపణుల స్థానాలను ఇవి భర్తీ చేస్తాయి.
ఈ పరిణామాలన్ని భారతదేశ ప్రాంతీయ భద్రతా స్థితిని కొత్త శిఖరాలకు పెంచుతాయి. బ్రహ్మోస్, అస్త్ర వంటి స్వదేశీ క్షిపణులు దూరం నుంచి శత్రువులను లక్ష్యంగా చేసుకొని పని చేస్తాయి. వాస్తవానికి బ్రహ్మోస్ కొత్త వర్షన్ అనేది పాకిస్థాన్‌కు పెద్ద షాక్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: K Ramp : 2 రోజుల్లో 11.3 కోట్లు