ఖలిస్థానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందంటూ కెనడా చేసిన ఆరోపణలు ఇరుదేశాల మధ్య దుమారం రేపిన సంగతి తెలిసిందే . తాజాగా భారత్ పై దాయాది దేశం పాక్ సంచలన ఆరోపణలు చేసింది. రెండు రోజుల క్రితం తమ దేశంలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో భారత దేశ ప్రమేయం ఉందని పాక్ మంత్రి ఒకరు అన్నారు. మస్తుంగ్ లో జరిగిన సూసైడ్ అటాక్ వెనక రా ఏజెంట్ల పాత్ర ఉందని పాక్ మంత్రి సర్ఫరాజ్ బుగ్తీ చెప్పుకొచ్చారు. నిందితుడి గురించి తెలుసుకునేందుకు అతడికి డీఎన్ఏ టెస్ట్ చేయిస్తున్నట్లు తెలిపిన మంత్రి డీఎన్ఏ నమూనాలను టెస్ట్ ల కోసం ల్యాబ్ కు పంపించినట్లు తెలిపారు. ఇక ఈ ఆరోపణల నేపథ్యంలో అసలే అంతంత మాత్రంగా ఉండే పాక్ ఇండియా సంబంధాలు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై భారత్ ఎలాంటి సమాధానం ఇస్తుందో వేచి చూడాల్సిందే. ఇప్పటికే కెనడా ఆరోపణల నేపథ్యంలో ఆధారాలు చూపించి మాట్లాడాలని భారత్ పట్టుబడుతుంది.
Also Read:Airfare Price Hike: పెరిగిన విమాన ఇంధన ధరలు.. పండుగల సీజన్లో ప్రయాణికులకు షాక్
ఇక శుక్రవారం నాడు బలూచిస్థాన్ ప్రావిన్సులోని మస్తుంగ్ జిల్లాలో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. మహ్మద్ ప్రవక్త జయంతిని పురస్కరించుకుని భక్తులు ఎంతో సంతోషంగా ర్యాలీకి సమాయత్తం అవుతున్న తరుణంలో ఓ వ్యక్తి తనని తాను పేల్చుకొని దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడులను ఖండించిన బలూచిస్థాన్ తాత్కాలిక ప్రభుత్వం.. మూడు రోజుల సంతాప దినాలు ప్రకటించింది. పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం డిపార్ట్ మెంట్ ఈ దాడులపై విచారణ జరుపుతోంది. అయితే ఈ దాడులు తామే చేశామంటూ ఎవరు ప్రకటించకపోవడంతో పాక్ భారత్ పై ఆరోపణలు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉండటం చూస్తుంటే పాక్ కయ్యానికి కాలు దువ్వుతున్నట్లే కనిపిస్తుంది.