Ravi Shastri Recalls Virat Kohli Test Captaincy: భారత జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే తన దృష్టి విరాట్ కోహ్లీపై పడిందని టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. భవిష్యత్తులో నువ్ కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్నీ పరిశీలించు అని కోహ్లీతో చెప్పినట్లు రవిశాస్త్రి పేర్కొన్నాడు. అప్పటికి విరాట్ తనకు ఇంకా సానబెట్టని వజ్రంలా కనిపించాడని చెప్పాడు. భారత జట్టు డైరక్టర్‌గా 2014లో రవిశాస్త్రి సేవలందించాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. విరాట్ కెప్టెన్సీలో విదేశీ గడ్డపై భారత్ అద్భుత విజయాలు సాధించడంలో రవిశాస్త్రి కీలక పాత్ర పోషించాడు.
ఇటీవల మైఖేల్ అథర్టన్‌కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పలు విషయాలపై స్పందించాడు. టెస్ట్ క్రికెట్‌లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ, జస్ప్రీత్ బుమ్రా ప్రయాణంను గుర్తుచేసుకున్నాడు. ‘భారత జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే కోహ్లీపై నా దృష్టి పడింది. నేను హెడ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రెండో నెలలోనే కోహ్లీకి ఓ విషయం చెప్పా. ”భవిష్యత్తులో నువ్ కెప్టెన్సీ చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి అంశాన్నీ పరిశీలించు, కెప్టెన్సీకి సిద్ధంగా ఉండు” అని కోహ్లీతో అన్నా. అప్పటికి అతడు నాకు సానబెట్టని వజ్రంలా కనిపించాడు. కెప్టెన్సీ తర్వాత కోహ్లీ టెస్టు క్రికెట్‌పై పూర్తి దృష్టిసారించాడు. క్లిష్టమైన పిచ్‌లపై కూడా జట్టును గెలిపించేందుకు ప్రయత్నించాడు. ప్రత్యర్థి ఎవరైనా దూకుడుగా వ్యవహరించాం. మంచి ఫలితాలు వచ్చాయి’ అని రవిశాస్త్రి చెప్పాడు.
Also Read: IPL 2024: చెన్నై సూపర్ కింగ్స్‌కు కొత్త స్పాన్సర్.. ఎంఎస్ ధోనీ జెర్సీ వైరల్!
రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ మంచి ఫలితాలు సాధించారు. స్వదేశంలోనే కాదు విదేశీ గడ్డపై కూడా టెస్ట్ సిరీసులు గెలిచారు. దాంతో రవిశాస్త్రి రెండోసారి కూడా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. రవిశాస్త్రి స్వయంగా తప్పుకోవడంతో అతడి స్థానంలో రాహుల్ ద్రవిడ్ వచ్చాడు. అయితే రవిశాస్త్రి, కోహ్లీలు ఐసీసీ ట్రోఫీలు మాత్రం గెలవలేకపోయారు. ప్రస్తుతం కోహ్లీ జట్టుకు దూరంగా ఉన్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కు మొత్తానికి దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో టెస్టు సిరీస్‌కు దూరమైన కోహ్లీ నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని బీసీసీఐ వెల్లడించింది.