Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుజ్జీవానికి ఆఖరి అవకాశం లభించింది. సొంత గనులు లేకుండా భారీ విస్తరణ దిశగా వెళ్ళిన ఫలితంగా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది RINL. వడ్డీలు, రామెటీరియల్ కొనుగోళ్ళు కారణంగా అప్పులు సుమారు 40వేల కోట్ల రూపాయలకు చేరాయి. దీంతో 2021లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన చేసింది కేంద్రం. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు మనుగడ ప్రశ్నార్ధకం కావడంతో కార్మిక, రాజకీయ పోరాటాలు జరిగాయి. మారిన రాజకీయ పరిస్ధితులు కారణంగా NDA ప్రభుత్వం RINL పునరుద్ధరణకు భారీ సహాయం ప్రకటించింది. డైరెక్ట్ ఈక్విటీ కింద10,300 కోట్లు, షేర్ క్యాపిటల్ కింద 1,140 కోట్లు కేంద్రం కేటాయించింది. విద్యుత్, వాటర్, టాక్స్‌ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మరో 2 వేల కోట్ల రూపాయల వెసులుబాటు కల్పించింది. ఫలితంగా ఊపిరి పీల్చుకున్న విశాఖ ఉక్కును100 శాతం ఉత్పత్తి లక్ష్యం సాధించడం ద్వారా లాభాల బాట పట్టించేందుకు చర్యలు ఊపందుకున్నాయి.
Read Also: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..
73లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన RINLలో బ్లాస్ట్ ఫర్నేస్‌లది కీలక భూమిక. ఇక్కడ గోదావరి, కృష్ణ, అన్నపూర్ణ పేరుతో కొలిమిలు ఉన్నాయి. వీటిలో బీఎఫ్ 1&2 నిర్వహణలో వుండగా, రా మెటీరియల్ కొరత, ఆర్ధిక నష్టాలు కారణంగా మూడవ యూనిట్ మూలనపడింది. ఈ దిశగా బ్లాస్ట్ ఫర్నేస్ -3ని పునరుద్ధరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఈనెల 27న అన్నపూర్ణ యూనిట్ ప్రారంభించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. గత మూడు నెలలుగా వరుస లాభాలను నమోదు చేస్తున్న RINLకు ఇది చాలా కీలకమైన సమయంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. పూర్తి స్ధాయి ఉత్పత్తి ద్వారా విశాఖ ఉక్కు పునర్వైభవం సాధించగలిగితే సెయిల్‌లో విలీనం చేసేందుకు అవకాశాలు మెరుగుపడతాయి.
Read Also: Real Estate Scam: సొంతిటి కలలు కనే వారే టార్గెట్.. రియల్ ఎస్టేట్‌లో కొత్త తరహా మోసాలు..
భారీ ప్యాకేజీ ప్రకటించిన తర్వాత విశాఖ ఉక్కులో సంస్కరణలు ఊపందుకున్నాయి. ఇప్పటికే మానవ వనరులను భారీగా కోత పెట్టిన యాజమాన్యం… ఇప్పుడు కీలక విభాగాలను ప్రైవేటీకరిస్తోంది. ఉత్పత్తిలో అత్యంత కీలకంమైన RMHP, సింటర్ ప్లాంట్లను కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన విడుదల చేసింది. విశాఖ ఉక్కు కర్మాగారం తీర ప్రాంతంలో వున్న ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలో ఒకటి. రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రొడక్ట్ వరకు అన్నీ ఒకే దగ్గర జరుగుతాయి. ఇవన్నీ యాజమాన్యం పరిధిలో ఉండాల్సినవి. కానీ వీటిని విభాగాలుగా విడగొట్టి నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్ట్ సంస్ధలకు అప్పగించడం భద్రతతో చెలగాటమే అంటున్నాయి కార్మిక సంఘాలు. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కును సంరక్షించడమే ప్రధానంగా భావిస్తున్నాయి. ఆ దిశగా కఠిన నిర్ణయాలను అమలు చేసేందుకు వెనుకాడటం లేదు. భవిష్యత్తులో రా మెటీరియల్ కొరతను అధిగమించేందుకు చత్తీస్‌గఢ్ నుంచి నేరుగా పైప్‌లైన్ ఏర్పాటు ఆలోచనలు కూడా ఉన్నాయి.