Punjagutta Murder Case: హైదరాబాద్ పంజాగుట్టలో వ్యాపారవేత్త జనార్ధన్ రావు హత్య కేసులో అతని మనవడు కీర్తితేజ పోలీస్ కస్టడీ ముగిసింది. మూడు రోజుల పాటు జరిగిన విచారణలో అతను తాతను హత్య చేసిన వివరాలను వెల్లడించాడు. కస్టడీ మొదటి రోజు పోలీసుల ప్రశ్నలకు కీర్తితేజ సమాధానం ఇవ్వకుండా మౌనం వహించాడు. ఎంత కదిలించినా అతను స్పందించలేదు. హత్య జరిగిన స్థలానికి తీసుకెళ్లి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయడానికి ప్రయత్నించినా పూర్తిగా సహకరించలేదు. అయితే, రెండో రోజు విచారణలో కీర్తితేజ నోరు విప్పి హత్య వెనుకున్న అసలు కారణాలను బయటపెట్టాడు.
Read Also: Pulivendula By Election: పులివెందుల ఉప ఎన్నికపై కుంభమేళాలో ఆసక్తికరమైన చర్చ!
తాత నన్ను ఎప్పుడూ అవమానించేవాడని, తాత నన్ను ప్రతిరోజూ ‘బెగ్గర్’ అని అవమానించేవాడని చెప్పుకొచ్చాడు. ఆఫీసులో కూడా నన్ను చిన్నచూపు చూశారని, తాత ఆస్తి పంపకాల్లోనూ నన్ను మోసం చేశాడని తెలిపాడు. డైరెక్టర్ పదవి కూడా నాకిచ్చే బదులు తన రెండో కుమార్తె కొడుకుకు ఇచ్చాడని.. ఈ వివాదాల కారణంగా మేమిద్దరం తరచుగా గొడవపడేవాళ్లమని తెలిపాడు. చివరికి తాతను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు అంగీకరించాడు.
కీర్తితేజ హత్యకు ముందు ఇన్‌స్టామార్ట్ నుంచి కత్తి కొనుగోలు చేసినట్లు తెలిపాడు. హత్య జరిగిన రోజు తాతతో పెద్ద గొడవ జరిగిందని, తాతను పొడవడానికి కసితీరా కత్తిని వాడినట్లు తెలిపాడు. హత్య అనంతరం బిఎస్ మక్తా ఎల్లమ్మగూడ పక్కనున్న ఖాళీ స్థలంలో హత్యకు ఉపయోగించిన కత్తిని, రక్తంతో ఉన్న తన బట్టలను తగులబెట్టేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. మంటల్లో సగం కాలిన కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్యకు సంబంధించి అన్ని కీలక ఆధారాలు పోలీసులు సేకరించారు. కీర్తితేజ హత్యను అంగీకరించడం, సాక్ష్యాలు పోలీసుల చేతికి రావడంతో కేసు త్వరలో కోర్టుకు వెళ్లనుంది. ఇప్పటికే అతనిపై పలు అభియోగాలు నమోదయ్యాయి. ఈ ఘటన పంజాగుట్టలో సంచలనం సృష్టించింది. ఆస్తి వివాదాల కారణంగా మనవడే తాతను హత్య చేయడం, కుటుంబ విభేదాలు ఏ స్థాయికి వెళ్లొచ్చో చూపిస్తుంది. తీవ్రపంచిన మనోభావాల వల్ల ఎలా పెనుసంక్షోభాలు చోటుచేసుకుంటాయో ఈ ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.