ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పులివెందుల ఉప ఎన్నికపై ఆసక్తికర చర్చ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పుణ్య స్నానాలు ఆచరిస్తున్న సమయంలో పులివెందులకు ఉప ఎన్నిక రావాలని బాగా ముక్కుకో అంటూ మాజీ ఎంపీ, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు కామెంట్ చేశారు. ఉప ఎన్నికలు వస్తే మీరే పులివెందులకు ఇన్చార్జిగా రావాలని రామకృష్ణం రాజుకు బిటెక్ రవి సూచించారు. ఉప ఎన్నికలు వస్తే తాను తప్పకుండా పులివెందులకు ఇన్చార్జిగా వస్తానంటూ ఆయన హామీ ఇచ్చారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గతేడాది జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నుంచి వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గెలిచారు. టీడీపీ నుంచి పోటీ చేసిన బీటెక్ రవి ఓడిపోయారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఇప్పటివరకు వైఎస్ జగన్ వెళ్లలేదు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. వైసీపీ హాజరు, గైర్హాజరుతో సంబంధం లేకుండా.. పలు అంశాలను సభ ముందు ఉంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. మరోవైపు అసెంబ్లీకి హాజరవ్వకూడదని జగన్ చెప్పిన కారణాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎవరైనా ఎమ్మెల్యే వరుసగా 60 రోజులు సభకు గైర్హాజరైతే.. సదరు ఎమ్మెల్యేపై అనర్హత వేటు పడుతుంది. సభకు హాజరు కాలేకపోవడానికి సరైన కారణం చూపుతూ.. స్పీకర్‌ను వ్యక్తిగతంగా కలిసి లీవ్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా 60 రోజులు సభకు డుమ్మా కొడితే.. అనర్హత వేటు పడటం ఖాయం. వైఎస్ జగన్ ఇదే తీరుగా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు అయితే ఆయనపై అనర్హత వేటు పడటానికి ఎంతో సమయం పట్టదు. జగన్ మీదనే కాదు ఆయన ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరౌతున్న వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా అనర్హత వేటు పడుతుంది. అప్పుడు రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు రావడం ఖాయం.