హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం మేఘావృతమైన వాతావరణం తర్వాత.. నగరంలోని అనేక ప్రాంతాలలో ఈదురు గాలులతో పాటు భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వర్షం కురిసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. లక్డీకాపూల్, బేగంపేట్, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, కూకట్‌పల్లి, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. మరికొన్ని గంటల పాటు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. పలుచోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రోడ్లపై నీరు ప్రవహించడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. తుపాను కారణంగా పలు కాలనీల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. జీడిమెట్ల, సూరారం, బాలానగర్, కూకట్‌పల్లి సహా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. అయితే.. ప్రజలు అవసరముంటేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది.
Also Read : Mahmood Ali : మరోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారు
ఇదిలా ఉంటే.. మంగళవారం సాయంత్రం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఆదిలాబాద్, కుమ్రం భీం జిల్లాలో ఈదురు గాలులు భారీ వర్షంతో అతలాకుతలమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం నందిగామ గ్రామంలో వడగండ్ల వర్షం కురిసింది. వడగళ్ల వాన కాశ్మీర్‌ను గుర్తు చేసింది. భారీ వడగళ్ల వాన కారణంగా పలుచోట్ల ఇళ్ల పైకప్పులు, పంటలు ధ్వంసమయ్యాయి. ఇచ్చోడ, గుడిహత్నూర్, నార్నూర్ మండలంలోని నాడంగూడ గ్రామాల్లోనూ వడగళ్ల వాన కురిసింది.
ఈదురు గాలులకు పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఉట్నూర్‌లో భారీ వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. రోడ్డుపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇచ్చోడ మండలం బడిగూడ గ్రామంలో పదిహేను ఇళ్లు ధ్వంసం కావడంతో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతంరెడ్డి రూ.5000 సహాయం అందించారు. రైతులు మామిడి తోటలపైనే ఎక్కువగా ఆధారపడుతుండగా, తుపాను కారణంగా మామిడి కాయలు దెబ్బతిన్నాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రైతులు సైతం కుప్పలు తెప్పలుగా వేసిన పంటలు వర్షంతో తడిసిపోయాయి. దీంతో రైతులు చాలా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.