Bhadrachalam: శ్రీరామనవమిని పురస్కరించుకొని “దక్షిణ అయోధ్య”గా ఖ్యాతిగాంచిన భద్రాచలంలో భక్తుల సందడి నెలకొంది. ప్రతిఏటా నిర్వహించే సీతారాముల కళ్యాణానికి ప్రాముఖ్యత కలిగిన శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం దశమి రోజున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారులు, అర్చకులు సంపూర్ణ సమన్వయంతో భక్తులకు శ్రద్ధాభక్తులతో ఈ ఘట్టాన్ని తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా భక్తులు ఉదయం నుంచే భద్రాచలంలోని మిథిలా స్టేడియంకు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. శ్రీరామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరై, స్వామివారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.
Read Also: Stock Market: ‘బ్లాక్ మండే’.. స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం
ఆదివారం రోజు భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, శ్రీ సీతారామ లక్ష్మణ హనుమంతులకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలను సమర్పించారు. అభిజిత్ ముహూర్తంలో జరిగిన కళ్యాణం కనుల పండువగా జరగడం విశేషం. ఈ సందర్భంగా భద్రాచలాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు. ఇక శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అంగరంగ వైభవంగా జరిపారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం తాకిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. భద్రాచలంలో మరికాసేపట్లో జరగనున్న అపురూపమైన పట్టాభిషేక మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు ఇప్పటికే భారీగా తరలివచ్చారు.