వరంగల్, హనుమకొండ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పర్యటించారు. తొలుత నగరానికి చేరుకున్న ఆమె.. శ్రీభద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హనుమకొండలోని హంటర్ రోడ్డులో వరద ముంపునకు గురైన ఎన్టీఆర్ నగర్, ఎన్ఎన్ నగర్ ప్రాంతాల్లో బాధితులను ఆమె పరామర్శించారు. రెడ్ క్రాస్ సొసైటీ సమకూర్చిన హెల్త్ కిట్స్, నిత్యావసరాలను వరద బాధితులకు గవర్నర్ తమిళిసై పంపిణీ చేశారు. వరద బాధితుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని.. సాయమందేలా చూస్తానని తమిళిసై హామీ ఇచ్చారు.
Read Also: Guntur Kaaram: మళ్లీ మొదలవనున్న షూటింగ్…
ఈ సందర్భంగా భద్రకాళి చెరువు కట్ట మరమ్మతుల పనులను గవర్నర్ తమిళిసై పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వరద ప్రభావం వరంగల్ లో దారుణంగా ఉంది.. భారీ వరదలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపాయి. వరదలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పుకొచ్చారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు తలెత్తుతున్నాయో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.. సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని తమిళిసై అన్నారు.
Read Also: Pawan Kalyan: పవన్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. వచ్చే వారం నుంచే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ?
ప్రకృతి ప్రకోపం కంటే ఆక్రమణల వల్లే ఎక్కువ నష్టం జరిగింది అని గవర్నర్ తమిళిసై అన్నారు. వర్షంతో పాటు ఆక్రమణల కారణంగా ఎక్కువ ముంపు జరిగింది.. స్వచ్ఛమైన తాగునీరు, మెడికల్ కిట్స్ ప్రభుత్వం అందించాలి అని ఆమె అన్నారు. కేంద్ర బృందం పర్యటిస్తూ వరద నష్టాన్ని అంచనా వేస్తోంది.. బాధితులకు నిత్యావసర సరుకులు అందించినందుకు రెడ్ క్రాస్ సంస్థకు ధన్యవాదాలు అని గవర్నర్ తమిళిసై చెప్పారు.