Ramesh Kumar Reddy Resigns: ఎన్నికల తరుణంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ పార్టీ.. ఆ పార్టీ అనే తేడా లేకుండా.. అన్ని పార్టీలకు చెందిన నేతలు.. తమ పార్టీకి రాజీనామా చేసి.. మరో పార్టీ గూటికి చేరుతున్నారు.. ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.. టీడీపీకి రాజీనామా చేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశానని వెల్లడించిన ఆయన.. ప్రజలకు సేవ చేసే పార్టీలా టీడీపీ పనిచేయడం లేదన్నారు. డబ్బులు తీసుకుని టికెట్లు అమ్ముకోవడం దారుణం అన్నారు. పార్టీ అభివృద్ధికి పని చేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని సంప్రదించకుండా టికెట్లు కేటాయించడం దుర్మార్గం అన్నారు. తమ బాధలు.. జరుగుతోన్న అన్యాయాన్ని చెప్పుకోవడానికి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అపాయింట్‌మెంట్ సైతం దొరకని పరిస్థితి టీడీపీలో ఉందన్నారు. ఇక, రేపు వినుకొండలో జరిగే మేమంతా సిద్ధం సభలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి.
Read Also: Pemmasani Chandrashekar: ఇఫ్తార్ విందులో పాల్గొన్న పెమ్మసాని చంద్రశేఖర్
కాగా, టీడీపీలో టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డితో.. టచ్‌లోకి వెళ్లింది వైసీపీ.. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి.. రమేష్ కుమార్ రెడ్డితో సమావేశమై చర్చలు జరిపారు. వైసీపీలో చేరాల్సిందిగా ఆయన్ని ఆహ్వానించారు.. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యత కల్పిస్తామని వారిచ్చిన హామీతో రమేష్ కుమార్ రెడ్డి కొంత మెత్తబడినట్లుగా.. వైసీపీలో చేరేందుకు సుముఖత చూపినట్టు ప్రచారం జరగగా.. ఇప్పుడు ఆయనే వినుకొండలో జరిగే మేమంతా సిద్ధం సభలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు.