Karnataka Elections: కర్ణాటకలో 20 రోజులుగా సాగిన ఎన్నికల ప్రచార హోరు ముగిసింది. ర్యాలీలు, రోడ్ షోలకు తెరపడింది. 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీకి ఈ నెల 10న ఎన్నికలు జరుగనున్నాయి. 13న ఫలితాలు వస్తాయి. ప్రజలు ఎలాంటి ఫలితం ఇస్తారనే విషయమై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. అందుకే ఆఖరి పంచ్ ఐటీ సిటీలో ఇచ్చాయి ప్రధాన పార్టీలు. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ కీలకంగా మారింది. ఇక్కడ 28స్థానాల్లో మెజారిటీ సాధించిన పార్టీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చరిత్ర ఉంది. దీంతో అర్బన్ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాయి. 2008 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ గెలిచింది. 2013, 2018 ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ గెలిచింది. అయితే ఈ సారి ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నువ్వానేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రచారపర్వాన్ని హోరెత్తించాయి. బెంగళూరులో మహదేవపుర, బీటీఎం లేఔట్, యెలహంక, హెబ్బాళ, యశ్వంతపుర, కేఆర్‌పురలో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
కర్ణాటకలో దాదాపుగా నెల రోజులుగా జరిగిన ఎన్నికల ప్రచార సరళిని చూస్తే ఇది అసెంబ్లీ పోరా? లోక్‌సభ సమరమా? అనే సంశయం కలగక మానదు. ఆ స్థాయిలో జాతీయ నేతలు కన్నడనాట సందడి చేశారు. మార్చి 29న ఎన్నికల తేదీలు ప్రకటించగా.. అదే రోజున నియమావళి అమల్లోకి వచ్చింది. అంతకు ముందే రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైనా గత 38 రోజుల్లో రాష్ట్రంలో ప్రచారం హోరెత్తింది. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌తోపాటు జాతీయ, రాష్ట్ర పార్టీలు ఈ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 918 మంది స్వతంత్రులతో కలిపి 2,613 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికలు అరుదైన రికార్డులకు వేదికయ్యాయి. 2024లో లోక్‌సభ ఎన్నికలకు దిక్సూచిగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించే ఈ ఎన్నికల ప్రచారానికి జాతీయ నేతలు తరలి వచ్చారు. 2018లో 3 ప్రధాన పార్టీలు 40 రోజుల్లో 530 రోడ్ షోలను నిర్వహించగా ఈ ఎన్నికల్లో వాటి సంఖ్య 1,230కు చేరుకుంది. వీటిలో అత్యధికంగా 440 రోడ్ షోలను బీజేపీ, 320 కాంగ్రెస్, 300కుపైగా జేడీఎస్ నిర్వహించింది. బహిరంగ సభల్లోనూ ఈ ఎన్నికలు రికార్డులు సృష్టించాయి. 2018లో 400కుపైగా బహిరంగ సభలు నిర్వహించగా ఈ ఎన్నికల్లో 870 సభలను నిర్వహించినట్లు ఆయా పార్టీల నివేదికలు వెల్లడించాయి. బీజేపీ అత్యధికంగా 275, కాంగ్రెస్ 240, జేడీఎస్ 221 బహిరంగ సభలు, సమావేశాలను నిర్వహించాయి.
ఈ ఎన్నికల్లో దాదాపుగా జాతీయ పార్టీల నేతలందరూ ప్రచారంలో భాగస్వాములయ్యారు. వీరిలో బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అత్యధిక రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొని రికార్డు సృష్టించారు. ఆయన మొత్తం 14 సార్లు కర్ణాటకలో పర్యటించగా, 110 రోడ్ షోలు, 27 బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రధానితో పోటీ పడుతూ రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ పార్టీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతోపాటు నిర్మలా సీతారామన్, ఎస్.జైశంకర్, నితిన్ గడ్కరీ తదితర కేంద్ర మంత్రులంతా ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ తరఫున జాతీయ నేతల దండు కదలి వచ్చింది. రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా కనీసం 10 సార్లు కర్ణాటకకు వచ్చి వెళ్లారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి ప్రచారంలో పాల్గొన్నారు. పక్షం రోజులుగా 20కిపైగా రోడ్ షోలు, బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. 2019 లోక్‌సభ ఎన్నికల తర్వాత గత శనివారం ప్రచారానికి వచ్చిన సోనియా గాంధీ హుబ్బళ్లిలో ఒకే ఒక సభలో పాల్గొన్నారు. మరోవైపు కింగ్ మేకర్‌ను కాదు కింగ్‌నే అవుతామన్న ధీమాతో ఉన్న జేడీఎస్ ఆ పార్టీ అధినేత హెచ్.డి.దేవేగౌడ నేతృత్వంలో ప్రచారాన్ని హోరెత్తించింది. మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి.కుమారస్వామి, ఆయన కుమారుడు నిఖిల్ కుమారస్వామి ప్రచార బాధ్యతలను నిర్వహించారు.
ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి హోరాహోరీగా తలపడుతుంటే.. జనతాదళ్ ఎస్ కూడా తనేమీ తక్కువ కాదన్నట్లు ప్రచారంలో దూసుకుపోయింది. ఆ పార్టీ తరఫున మాజీ ప్రధాని దేవెగౌడ రోజుకు మూడు నాలుగు సభలలో ప్రసంగించారు. ఆయన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం చెమటోడ్చారు. పాత మైసూరు ప్రాంతానికే పరిమితమైన తన పార్టీని ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు కృషి చేశారు. ప్రచారం పూర్తైన తర్వాత కూడా కర్ణాటక ఎన్నికల సమీకరణాలు సంక్లిష్టంగానే ఉన్నాయి. సామాజికవర్గాల లెక్కలతో పాటు ఉచిత హామీలు, అవినీతి, నిరుద్యోగం, అగ్రనేతల ఛరిష్మా.. ఇలా చాలా అంశాలు ఫలితాల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఏ పార్టీ కూడా గెలుస్తామనే ధీమాతో కనిపించడం లేదు. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా.. లోపల ఎవరి డౌట్లు వారికున్నాయి. ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే ఊహే వారిని భయపెడుతోంది. పాతికేళ్లుగా రెండోసారి ఒకే పార్టీకి ఓటేసే అలవాటు లేని కన్నడ ఓటర్లు ఈసారి ఏం చేస్తారనేది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ గెలుపు ఖాయమనే విశ్వాసంతో ఉంది. బీజేపీ కూడా రెండోసారి అధికారం పక్కా అంటోంది. అధికార పీఠం ఎవరిదో తామే డిసైడ్ చేస్తామనేది జేడీఎస్ ఫీలింగ్. ఇలా ప్రధాన పార్టీలకు ఎవరి లెక్కలు వారికున్నాయి. ఎవరి వ్యూహం వర్కవుట్ అవుతుందనేది ఫలితాల్ని డిసైడ్ చేయనుంది.
దేశమంతా ఉచితాల్ని వ్యతిరేకిస్తున్న బీజేపీ.. కర్ణాటకలో మాత్రం అవే ఉచిత హామీలనే నమ్ముకుంది. లింగాయత్ ఓటర్లు అసంతృప్తిగా ఉన్నారన్న వార్తల తరుణంలో.. హిందుత్వ కార్డు వాడేసింది. భజరంగ్ దళ్ ని బ్యాన్ చేస్తామన్నకాంగ్రెస్ హామీని హైలైట్ చేసింది. హనుమాన్ భక్తుల్ని అవమానిస్తున్నారని మోడీ ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. జై బజరంగ్ బలీ నినాదం కూడా ఇచ్చారు. హనుమాన్ ఆలయాల్లో హనుమాన్ చాలీసా పఠనాలతో.. హిందూ ఓటర్లను సంఘటితం చేసే ప్రయత్నం గట్టిగా చేసింది. ఈ తరహా ప్రయత్నాలు తమకు ఉపయోగపడుతోందని నమ్ముతోంది. మోడీ వేవ్ కూడా కలిసొస్తుందని భావిస్తోంది. అయితే అసంతృప్తుల బెడద ఏం చేస్తుందోననే అనుమానాలు కాషాయ పార్టీలో ఉన్నాయి. కాంగ్రెస్ కు బలమైన స్థానిక నాయకత్వం, క్యాడర్ ఉండటం అడ్వాంటేజ్. జాతీయ నాయకత్వం ప్రచారంతో సంబంధం లేకుండానే గెలిచే సత్తా ఉందనేది కర్ణాటక కాంగ్రెస్ నేతల ధీమా. కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి వస్తోందని రాష్ట్ర పార్టీ నేతలు మొదట్నుంచీ చెబుతూ వస్తున్నారు. బీజేపీ సర్కారు చేసిందేమీ లేదని, ప్రజా వ్యతిరేకత బాగా ఉందని కాంగ్రెస్ చెబుతోంది. గ్రామీణ కర్ణాటక నుంచి తమకు పెద్ద మద్దతు ఉందనేది కాంగ్రెస్ చెబుతున్న మాట. తనకు ఇవే చివరి ఎన్నికలని చెబుతున్న సిద్ధరామయ్య సెంటిమెంట్ కూడా పనిచేస్తుందనే నమ్మకంతో ఉంది. జేడీఎస్ ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదనే మాట మొదట్లో వినిపించింది. అందుకు తగ్గట్టే ఆ పార్టీకి సింగిల్ డిజిట్ సీట్లే వస్తాయనే వాదన కూడా వినిపించింది. కానీ తర్వాత పరిస్థితి మారింది. కుమారస్వామికి పాత మైసూర్ లో వచ్చిన స్పందన, వీల్ చైర్ లో దేవెగౌడ ప్రచారం వంటివి.. మళ్లీ జేడీఎస్ ని సీరియస్ ప్లేయర్ ని చేశాయి. కుమారస్వామి కూడా తనకు ఇవే చివరి ఎన్నికలని ప్రకటించడం.. డూ ఆర్ డై అన్నట్టుగా పోరాడుతున్నారు. దీంతో అధికారం సంగతి పక్కనపెడితే.. పార్టీ బలమేంటో చాటిచెప్పాలనే పట్టుదల జేడీఎస్ లో కనిపిస్తోంది.