కరీంనగర్ లో గ్రానైట్ వ్యాపారుల ఇండ్లపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. గ్రానైట్ యజమానులు పెద్ద ఎత్తున టాక్స్ లు ఎగ్గొట్టారని గతంలో బండి సంజయ్ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగానే ఈడీ అధికారులు ఈరోజు గ్రానైట్ వ్యాపారుల ఇండ్లపై దాడులు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ పట్టణంలోని మంకమ్మతోట,కమాన్ చౌరస్తా,బావుపేట ప్రాంతాల్లో ఐటీ, ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అరవింద గ్రానైట్స్, శ్వేత గ్రానైట్స్ లతో పాటు.. గంగాధర రావు, అరవింద్ వ్యాస్ అనే వ్యాపారులు ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. ఫెమా నిబంధనలు ఉల్లంఘించారని గతంలోను పలు గ్రానైట్ క్వారీ యజమానులకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపు 350కిపైగా గ్రానైట్ సంస్థలు ఉండగా.. వీటిల్లో అత్యధికం రాజకీయ నేతలవే. అయితే.. వారిలో ఒకరు మంత్రి గంగుల కమలాకర్.,. ఆయన ఆధ్వర్యంలోనూ కొన్ని గ్రానైట్ సంస్థలు ఉన్నాయి. 2012లో జరిగిన స్కామ్‌పై సీబీఐ గతంలో నోటీస్ ఇచ్చింది. బీజేపీ నేతల ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. అయితే.. 2011-2013 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరీంనగర్ నుంచి కాకినాడ పోర్టు, కృష్ణపట్నం పోర్టుల నుంచి వేల కోట్లలో గ్రానైట్ ఎగుమతలు జరిగాయి.
Also Read : Ravindra Jadeja Wife: బీజేపీ అభ్యర్థుల జాబితాలో రవీంద్ర జడేజా భార్య.. !
దొంగ లెక్కలతో సరుకు ఎగుమతి చేసి షిప్పింగ్ ఏజెన్సీలు వందల కోట్ల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలోనే ఈ రెండు పోర్టుల నుంచి లక్షల టన్నుల గ్రానైట్ రాయి విదేశాలకు ఎగుమతైంది. అక్రమాలను అప్పట్లోనే గుర్తించిన విజిలెన్స్ అధికారులు భారీ జరిమానా విధించారు. ప్రభుత్వానికి దాదాపు 750 కోట్లు చెల్లించాలని ఆనాటి ఉత్తర్వుల్లో ఉంది. ఆ నాటి కేసుకు సంబంధించి బీజేపీ నేతలు గత ఏడాది నవంబర్‌లో సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో చాలా సంస్థలు ఉన్నా.. మంత్రి గంగుల కమలాకర్ లక్ష్యంగానే చర్యలు ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ సీబీఐ నుంచి వచ్చిన ఆదేశాలతో విశాఖపట్నంలోని సీబీఐ ఏసీబీ విభాగం గతంలో మైనింగ్ కంపెనీలు.. షిప్పింగ్ ఏజెన్సీలకు నోటీసులు ఇచ్చాయి. ఎంత సరుకు పోర్టుల నుంచి ఎగుమతి చేశారు? పర్మిట్లు ఉన్నాయా? అపరాధ రుసుం ఎందుకు చెల్లించలేదు? వంటి ప్రశ్నలు ఆ నోటీసులో ఉన్నట్లు తెలుస్తోంది.