ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని దేవినేని ఉమా ఆరోపించారు. పోలవరం సందర్శనకు వెళ్లిన గోబెల్స్ మంత్రికి ఇప్పుడే వాస్తవాలు అర్థమయ్యాయా అంటూ నిలదీశారు.
డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తమ చేతుల్లో లేదంటున్న మంత్రి అంబటి రాంబాబు.. గతంలో ఎమ్మెల్యేల కమిటీలో సభ్యుడిగా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లినప్పుడు టీడీపీ ప్రభుత్వంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణమే జరగలేదని ఎలా అన్నారని దేవినేని ఉమా ప్రశ్నించారు. టీడీపీ హాయాంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరగలేదన్న రాంబాబు.. 2019-20లో అది దెబ్బతిన్నదని ఎలా చెప్పారని సూటిగా అడిగారు. సీఎం జగన్ వైఖరితో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణమే ప్రశ్నార్థకమైందని దేవినేని ఉమా విమర్శలు చేశారు. 36 నెలల పాలనలో ఈ ప్రభుత్వం, ఈ సీఎం పోలవరం ప్రాజెక్ట్ రివ్యూల వివరాలు, పనుల వివరాలు ఎందుకు బయట పెట్టలేదన్నారు. నిర్వాసితుల సొమ్మును వైసీపీ నేతలే పందికొక్కుల్లా దిగమింగుతున్నా సీఎం జగన్, మంత్రి అంబటి రాంబాబు ఎందుకు నోరెత్తడం లేదని నిలదీశారు. సీఎం జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంటే 2010-11 సంవత్సరాలకు సంబంధించిన పీపీఏ మినిట్స్ గానీ, తరువాత ఆగస్టులో జరిగిన పీపీఏ సమావేశం మినిట్స్ తక్షణమే బయటపెట్టాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి జగన్ మూర్ఖపు, అహంకారపూరిత నిర్ణయాలే కారణమని మండిపడ్డారు.