Crime: రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ చెలరేగుతోంది.దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ రేటు తక్కువగా(రూ.9 వ్యత్యాసం) ఉండటంతో అక్కడి నుంచి అక్రమంగా తీసుకువచ్చి హైదరాబాదులో విక్రయిస్తున్న ముఠాను పట్టకున్నారు. వట్టినాగులపల్లి లో తనిఖీలు నిర్వహించిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు రూ.35 లక్షలు విలువచేసే డీజిల్ ని పట్టుకున్నారు. కర్ణాటక నుండి తెలంగాణకు డీజిల్ స్మగ్లింగ్ చేస్తున్న7 మందిని అరెస్టు చేసి.. వారి నుంచి డీజిల్, ఫిలింగ్ మోటర్, జనరేటర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మాఫియాకు సంబంధించి ప్రధాన నిందితుడు రాధాకృష్ణ కోసం రాష్ట్రంలో గాలింపు చేపట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో డీజిల్ మాఫియాకి కీలక సూత్రధారిగా ఉన్న రాధాకృష్ణ.. గతంలో చాలా సార్లు పోలీసులకు పట్టుబడ్డట్లు విచారణలో తేలింది.
READ MORE: UPSC: కేంద్ర సాయుధ బలగాల్లో 506 పోస్టులకు నోటిఫికేషన్.. డిగ్రీ ఉంటే చాలు..
నిందితుడు రాధాకృష్ణ కోట్ల రూపాయల డీజిల్ ను కర్ణాటక నుంచి తెలంగాణకు స్మగ్లింగ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ స్మగ్లింగ్ ద్వారా నెలకు రూ.కోట్లలో తెలంగాణా రాష్ట్ర ఖజానాకు గండ్డి పడుతోంది. నిందితుడు రాధాకృష్ణ హైదరాబాద్ లో ఉన్న డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ నడుపుతున్న మరో స్మగ్లర్ సూర్య అలియాస్ సాయి రామ్ సూర్యకు సప్లయి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యజమాని తన మేనేజర్ అయిన రితేష్ ద్వారా చిన్న చిన్న టాంకర్లకు మార్చి స్థానికంగా ఉన్న ఇసుక లారీలకు, క్వారీ లారీలకు, డోర్ స్టెప్ డెలివరీ సర్వీస్ యాప్ ద్వారా సంప్రదించిన కన్జూమర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. గత నెలలో కూడా రాధాకృష్ణ ఇదే ప్లేస్ లో 18000 లీటర్స్ డీజిల్ అఫిషియల్ ట్యాంకర్ ద్వారా సప్లయి చేస్తూ.. సైబరాబాద్ ఎస్ఓటీ అధికారులకు చిక్కాడు. ప్రస్తుతం పరారిలో ఉన్న నిందితుడిపై గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో సైతం కేసులు ఉన్నాయి.