Addanki Dayakar : నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చడాన్ని తీవ్రంగా ఖండిస్తూ టీపీసీసీ నేతృత్వంలో హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని విమర్శించారు. బ్రిటీష్ వలస పాలకులకే వెనకడుగు వేయని కాంగ్రెస్ నాయకులు, మోడీకి భయపడతారని భావించడం బీజేపీ నేతల అహంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. తమ నేతలపై కుట్రలు పన్నుతున్న మోడీ, అమిత్ షాలపై ఆయన “పెద్ద కేడీలు” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో పోరాడిన కుటుంబాన్ని ఈ రోజు కక్షపూరితంగా టార్గెట్ చేయడాన్ని అడ్డగొట్టాలని, ప్రజలు దీనిపై స్పందించాలని దయాకర్ పేర్కొన్నారు. “రాహుల్ గాంధీ, సోనియా గాంధీలకు సొంత ఇల్లు లేకపోయినా, దేశాన్ని త్యాగాలు చేస్తూ సేవ చేస్తున్నారు. అలాంటి వారి పై కుట్రలు చేస్తే, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వాదులు ఒక్కటవుతారు,” అంటూ హెచ్చరించారు.
2029లో బీజేపీ ప్రభుత్వాన్ని కేంద్రంలో నుంచి గద్దె దించి తిప్పికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీపై జరుగుతున్న కుట్ర దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని రాజకీయంగా తొలగించాలన్న కుట్ర అని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ విద్వేషాలను వ్యాపింపజేస్తుంటే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రేమను పంచుతున్నాడని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని, అక్రమాలపై ప్రశ్నించే వారిని ఈడీ, ఐటీ దాడులతో బెదిరించేందుకు ప్రయత్నిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని దయాకర్ హెచ్చరించారు.
Supreme Court: “వారం రోజుల్లో సమాధానం చెప్పాలి” వక్ఫ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్‌న్యూస్.. జట్టులో చేరిన పేస్ సంచలనం!