Bhatti Vikramarka: మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలో అతి తక్కువ పని దినాలు జరిగేది తెలంగాణలోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. వరదలపై లోతుగా చర్చ చేయాలని బీఏసీ సమావేశంలో కోరామని ఆయన తెలిపారు. భూములు, సింగరేణి, ధరణి, బీసీ సబ్ ప్లాన్‌పై చర్చ చేయాలని డిమాండ్ చేశామన్నారు భట్టి విక్రమార్క. రాజ్యాంగంలో ఆరు నెలలకు సభ పెట్టాలని ఉంది కాబట్టి సభ పెట్టారని.. అది కూడా లేకుంటే సభ పెట్టే వారే కాదని ఆయన తెలిపారు. పని గంటలు కాదు.. పని దినాలు పెంచాలన్నారు.
Also Read: Moranchapalli: మోరంచపల్లిలో ఉద్రిక్తత.. తక్షణ సాయం అందించాలని రాస్తారోకో
సీఎంతో మాట్లాడి పని దినాలు 20 రోజులకు పెంచాలని స్పీకర్‌ను కోరామన్నారు. అధికార పార్టీని ఎలా ఎదుర్కోవాలి అనేది కాంగ్రెస్‌కు తెలుసన్నారు. ఉచిత విద్యుత్ మీద ఎలా చర్చ చేయాలో తమకు తెలుసన్న భట్టి విక్రమార్క.. రుణమాఫీ వడ్డీతో సహా చెల్లించాలన్నారు. పోడు భూములకు ఎంత మందికి పట్టాలు ఇవ్వాలి.. ఎంత మందికి ఇచ్చారు అనేది సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఎక్కడో ఓ చోట కట్టి.. అందరికి ఇచ్చాం అంటే ఎలా అంటూ ప్రశ్నించారు.
Also Read: Rajya Sabha: రాజ్యసభలో నవ్వులు.. ఛైర్మన్, ప్రతిపక్ష నేతల మధ్య సరదా సంభాషణ
ఉమ్మడి రాష్ట్రంలో భూముల అమ్మకం తప్పు అనే కదా తెలంగాణ తెచ్చుకుందని పేర్కొన్న భట్టి.. మరి ఇప్పుడు ఎందుకు భూములు అమ్ముతున్నారని ప్రశ్నించారు. పెద్దలకు ఇచ్చిన భూములు గుంజుకుంటాం అన్నారు.. ఇప్పుడేమో అసైన్డ్ ల్యాండ్‌లు గుంజుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తాము బీఆర్‌ఎస్‌ను ఫేస్ చేయడం కాదు.. కాంగ్రెస్ వాళ్లు ఫేస్ చేయాలని భట్టి పేర్కొన్నారు. ధైర్యం ఉంటే 20 రోజులు సభ పెట్టి.. అడిగిన వాటికి సమాధానం చెప్పాలన్నారు. తమకు మైక్ ఇస్తే వాళ్లకు ధైర్యం ఉన్నట్టేనని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.