Konda Vishweswar Reddy: 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రభాగన నిలపడమే ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ డివిజన్‌లోని లక్ష్మీనగర్ పార్క్‌లో మార్నింగ్ వాకర్స్‌ను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ మాత్రమేన్నారు. దేశాన్ని ఆర్థిక పథంలో నడుపుతున్న మోడీని మరోసారి ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. తొలిసారి ఓటుహక్కును వినియోగించుకోబోతున్న యువతీ, యువకులు తమ అమూల్యమైన ఓటును దేశానికి గర్వకారణంగా నిలుస్తున్న నరేంద్ర మోడీకి మాత్రమే వేయాలని కోరారు.
భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని రక్షిస్తున్న ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ మాత్రమేనని ఆయన అన్నారు. దేశంలో నరేంద్ర మోడీకి పోటీనే లేదన్నారు. దేశము మొత్తం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ నినదిస్తోందన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ ప్రజలందరికీ అన్ని ఇస్తున్నా.. ప్రతిపక్షాలు మాత్రం ఏమి ఇవ్వడం లేదని దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. నగరాలు, పట్టణాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందన్నారు. ఆ నిధులతోనే పట్టణ ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్స్, పారిశుద్ధ్యం, పార్కుల నిర్వహణ వంటి పనులు జరుగుతున్నాయని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. దేశం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న నాయకుడే మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. మార్నింగ్ వాక్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ముఖ్యనాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.