China: అగ్రరాజ్యం కావాలని కలలు కంటున్న చైనా అనేక సమస్యలను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గతంలో ఎప్పుడూ లేనంతగా ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న చైనా, అమెరికాతో కయ్యం పెట్టుకుంది. ఇవిలా ఉంటే అన్నింటి కన్నా ముఖ్యంగా ఆ దేశాన్ని మరో సమస్య పట్టిపీడిస్తోంది. అక్కడి ప్రజలు పెళ్లిళ్లు చేసుకునేందుకు, పిల్లల్ని కనేందుకు ససేమిరా అంటున్నారు. సింగిల్ గా ఉండటమే బెస్ట్ అని అలాగే కంటిన్యూ అవుతున్నారు. దీంతో కమ్యూనిస్ట్ ప్రభుత్వం తలలు పట్టుకుంటోంది.
గతంలో ఎప్పుడు లేని విధంగా ఆ దేశంలో జననాల రేటు చాలా తగ్గింది. మరోవైపు వృద్ధుల జనాభాతో ‘వృద్ధ చైనా’గా మారుతోంది. జననాల సంఖ్య పెంచేందుకు అక్కడి ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టినా జనాలు పట్టించుకోవడం లేదు. చైనాలో జననాల సంఖ్య గతేడాదితో పోలిస్తే రికార్డు స్థాయిలో 10 శాతం కనిష్టానికి చేరుకుంది. పిల్లల పేరెంట్స్ ని ఆదుకునేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిన తర్వాత కూడా చాలా వరకు జననాలు తగ్గాయి.
Read Also: Pakistan: పాక్ ఆటగాళ్లకు ఘనస్వాగతం పలకడంపై మండిపడుతున్న టీమిండియా అభిమానులు
నేషనల్ హెల్త్ కమిషన్ ప్రచురించిన నివేదిక ప్రకారం 2022లో చైనాలో 9.56 మిలియన్ల జనాభా మాత్రమే నమోదైంది. 1949 తర్వాత అతి తక్కువ జననాలు ఇప్పుడే నమోదయ్యాయి. పిల్లల సంరక్షణ , విద్యకు సంబంధించి అధిక ఖర్చులు, పెరుగుతున్న నిరుద్యోగం, ఉద్యోగ అభద్రత, లింగ వివక్షత వంటి కారణాల వల్ల యువజంటలు కేవలం ఒకే పిల్లాడితో లేకపోతే అసలే పిల్లలు వద్దనుకుని జీవిస్తున్నారు.
గతేడాది చైనా జనాభా 6 దశాబ్ధాలలో తొలిసారిగా 1.41 బిలియన్లకు పడిపోయింది. 1980-2015 మధ్య కాలంలో చైనా విధించిన ఒక బిడ్డ విధానం వల్ల జనాభా తిరోగమనం వైపు మళ్లింది. గతేడాది జన్మించిన పిల్లలలో 40 శాతం మందికి రెండవ సంతానం కాగా.. 15 శాతం ముగ్గురు లేదా అంతకన్నా ఎక్కువ సంతానం తర్వాత పుట్టిన వారని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల సంతానం రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు.