తెలంగాణలో ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్ కు పంపాలని ఓటర్లను కోరుతున్నారు. ఇదిలా ఉండగా.. జిల్లాల్లోని ప్రధాన నాయకులు వరుసగా పార్టీని వీడుతున్నారు. జగిత్యాలలో మాజీ సీఎం కేసీఆర్ రోడ్ షోకు ముందే బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జిల్లా కేంద్రంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో బీఆర్ఎస్ కౌన్సిలర్ల సమావేశం నిర్వహించారు. 6గురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
READ MORE: David Warner: డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియన్ కాదు.. ఢిల్లీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడుతూ.. పార్టీ విడడం చాలా బాధగా ఉందన్నారు. భవిష్యత్తు కార్యాచరణ త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పార్టీని వీడిన ఓ కౌన్సిలర్ కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీకోసం నిరంతరం శ్రమించాం.. కానీ ప్రస్తుత ఎమ్మెల్యే తమకు ఎలాంటి న్యాయం చేయలేదని వాపోయారు. మున్సిపల్ ఛైర్పర్సన్ ఎన్నికలో రెబల్ అభ్యర్థికి ఈ ఆరుగురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. ఈ కౌన్సిలర్ల కు ఇదివరకే బీఆర్ఎస్ విప్ జారీ చేసింది.
ఇదివరకే రాష్ట్రంలో చాలా చోట్ల ఈ పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన కొన్ని నెలలకే రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో సైతం అధికారం మారుతూ వచ్చింది. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్, బీజేపీలకు మారడంతో బీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్లు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా వెళ్లిన వారిలో అధికంగా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చాలా మున్సిపాలిటీలను కూడా సొంతం చేసుకుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల వేళ ఈ వలసలు అధికమయ్యాయి. ఇప్పుడు ఈ ఆరుగురు కౌన్సిలర్లు ఏ పార్టీలోకి వెళ్లబోతున్నారో అన్న అంశం ఆసక్తికరంగా మారింది.