Jake Fraser-McGurk Says David Warner is more Indian than Australian: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌పై ఆ జట్టు యువ ఆటగాడు జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వార్నర్ ఆస్ట్రేలియన్ కంటే భారతీయుడుగానే కనిపిస్తాడన్నాడు. వార్నర్ నిస్వార్థ ఆటగాడు అని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడన్నాడు. ఐపీఎల్ గురించి చాలా విన్నానని, ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తుందని జేక్ ఫ్రేజర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా యువ ఆటగాడైన జేక్ ఫ్రేజర్.. ఐపీఎల్ 2024లో ఢిల్లీ తరఫున ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌లలో 259 రన్స్ చేశాడు.
ట్రిస్టన్ స్టబ్స్‌తో జరిగిన సరదా సంభాషణ సందర్భంగా జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ మాట్లాడుతూ డేవిడ్ వార్నర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘నేను ఇప్పటివరకు చాలామంది క్రికెటర్లను కలిశా. నిస్వార్థ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతడు డేవిడ్ వార్నర్. ప్రతిఒక్కరి కోసం అతడు తన విలువైన సమయం కేటాయిస్తాడు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాడు. ఐపీఎల్ 2024లో ఇద్దరం ఒకే జట్టుకు ఆడుతుండడం సంతోషంగా ఉంది. ప్రతీ హోటల్‌లో నాకు రెండు గదుల దూరంలోనే దేవ్ భాయ్ ఉంటాడు. ప్రతీ రోజు ఉదయం వార్నర్‌తో కలిసి కాఫీ తాగేవాడిని. ఆ సమయంలో చాలా మాట్లాడుకుంటాం’ అని జేక్ ఫ్రేజర్ తెలిపాడు.
Also Read: T20 World Cup 2024: రోహిత్, ద్రవిడ్ సరైన ప్లేయర్లనే ఎంచుకున్నారు: గంగూలీ
‘ఒక్కోసారి డేవిడ్ వార్నర్‌ను చూస్తుంటే ఆస్ట్రేలియన్ కంటే భారతీయుడిగానే అనిపిస్తాడు. వార్నర్ 70 శాతం ఇండియన్, 30 శాతం ఆస్ట్రేలియన్ అని చెబుతా. వార్నర్ చాలా పొడవుగా ఉంటాడేమోనని ఊహించుకున్నా. కానీ నేను ఊహించనంత ఎత్తు లేడు. ఎత్తు లేకపోయినా అతడి మనసు చాలా గొప్పది. మేం క్యాప్‌ల కోసం గోల్ఫ్ ఆడేవాళ్లం. ఎవరు ఓడితే.. వాళ్లు గెలిచిన వ్యక్తికి క్యాప్‌ను కొనివ్వాలి. టెక్నికల్‌గా నేను గోల్ఫర్ కావడంతో ఎక్కువగా విజయం సాధించేవాడిని. వార్నర్ కూడా చాలా బాగా ఆడుతాడు. ఐపీఎల్ టోర్నీ గురించి చాలా విన్నా. ప్రత్యక్షంగా పోటీని చూస్తే ఆశ్చర్యమేస్తుంది’ అని జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ చెప్పుకొచ్చాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును డేవిడ్ వార్నర్ ఛాంపియన్‌గా నిలిపిన విషయం తెలిసిందే. ఇక కరోనా సమయంలో టాలీవుడ్ సినిమాలకు సంబంధించిన పాటలు, డైలాగులకు రీల్స్ చేసి సోషల్ మీడియాలో సందడి చేశాడు. ఇప్పుడు ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. తెలుగు చిత్రాలను మాత్రం వదలడం లేదు. అందుకే వార్నర్ ఆస్ట్రేలియన్ కాదు ఇండియన్ అని జేక్ ఫ్రేజర్ సరదాగా అన్నాడు.