కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇవాళ భారత్ బంద్ నిర్వహిస్తున్నాయి విపక్ష పార్టీలు. దేశ వ్యాప్తంగా చేపట్టిన బందులో పాల్గొంటున్నాయి. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు ఏకమయ్యాయి. భారత్ బంద్‌కు కాంగ్రెస్, జనసమితి, లెఫ్ట్ పార్టీలు ఒకే తాటి మీదకు వచ్చాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు..వ్యవసాయ చట్టాలపై గళం వినిపించనున్నాయి విపక్షాలు. జాతీయ రహదారులపై ధర్నాలకు సిద్దమయ్యాయి. తెలంగాణలో ఆర్టీసీ…విద్యుత్ చార్జీల పెంపు నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది. వీటికి నిరసనగా భారత్ బంద్‌లో పాల్గొంటున్నాయి విపక్షాలు.
మరోవైపు…భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతు ప్రకటించింది. నిరసనను శాంతియుతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేసింది. ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఏపీలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిపివేసింది.ఐతే…భారత్ బంద్‌కు వైసీపీ మద్దతు పలకటం సరికాదన్నారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే బందుకు మద్దతు ఇస్తున్నారని మండిపడ్డారు. వ్యవసాయ ఉత్పత్తులు దేశంలో ఏ ప్రాంతంలోనైనా నేరుగా ఈ-మార్కెటింగ్ ద్వారా అమ్ముకునే సౌకర్యం కల్పించటం తప్పా?అని ప్రశ్నించారు. దళారీల నుంచి రైతులను రక్షించే చట్టాలను తీసుకురాకూడదా?అని నిలదీశారు సోమువీర్రాజు. మొత్తానికి..ఇవాల్టి భారత్ బంద్‌ను విజయవంతం చేసేందుకు విపక్షాలు సిద్ధమైపోయాయి.