Buddhadeb Bhattacharya: పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య(79) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆయనను పామ్ అవెన్యూ నివాసం నుంచి గ్రీన్ కారిడార్ ద్వారా తరలించారు. ఆలీపోర్‌లోని ఉడ్‌ల్యాండ్స్ ఆస్పత్రికి తరలించారు. భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని వైద్యులు తెలిపారు. 79 ఏళ్ల భట్టాచార్య గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు ఊపిరి ఆడాలంటే నెబ్యులైజర్ సపోర్టు తప్పని సరి, అయితే గత కొన్ని రోజులుగా నెబ్యులైజర్ ఉపయోగించినా ఊపిరి ఆడటం చాలా కష్టంగా మారినట్లు సమాచారం.
Also Read: Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. ఆరుగురు నక్సల్స్ హతం!
క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై మాజీ సీఎంకు చికిత్స కొనసాగుతోంది. ఆయనలో ఆక్సిజన్ లెవల్స్ 70 శాతానికి పడిపోయాయని, దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై స్పృహా కోల్పోయారని పేర్కొన్నారు. కార్డియాలజిస్టులు, పల్మోనాలజిస్టుల పర్యవేక్షణలో భట్టాచార్యకు వైద్యం కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. భట్టాచార్య వెంట ఆయన భార్య మీరా, కుమార్తె సుచేతన ఉన్నారు. బుద్ధదేవ్ భట్టాచార్య గత కొన్నాళ్లుగా తన ఆరోగ్యం కారణంగా ప్రజా జీవితానికి దూరంగా ఉన్నారు. 2015లో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ నుంచి వైదొలిగిన ఆయన 2018లో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యత్వాన్ని వదులుకున్నారు.