ENG vs NED: ఈ ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఇంగ్లండ్ మరో గేమ్‌ను గెలుచుకుంది. టోర్నమెంట్‌లో ఇది వారికి రెండో విజయం మాత్రమే కావడం గమనార్హం. ఇంగ్లాండ్ జట్టు నెదర్లాండ్స్‌ను 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే ఆలౌట్ చేసి 160 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి నేరుగా అర్హత సాధించేందుకు ఈ రెండు పాయింట్లు కూడా ఎంతో ముఖ్యం. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా పుణెలోని మహారాష్ట్ర క్రికెట్‌అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది. నెదర్లాండ్స్‌కు 340 పరుగులు భారీ లక్ష్యాన్ని అందించింది. బెన్‌స్టోక్స్(108) సెంచరీతో, డేవిడ్ మలన్(87), క్రిస్ వోక్స్(51) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు చేయగలిగింది. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ బ్యాటర్ బెన్‌స్టోక్స్ ఒంటి చేత్తో జట్టుకు భారీ స్కోరును అందించడంలో సాయపడ్డాడు. నెదర్లాండ్స్‌కు చెందిన బౌలర్లు బాస్ డి లీడే మూడు వికెట్లు పడగొట్టగా, ఆర్యన్ దత్, లోగాన్ వాన్ బీక్ తలో రెండు వికెట్లు సాధించారు. పాల్ వాన్ మీకెరన్ ఒక వికెట్ తీశాడు.
Also Read: Minister KTR: బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరు.. మాది సెక్యులర్ పార్టీ
అనంతరం 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలోనే 179 పరుగులకే చతికిల పడింది. నెదర్లాండ్స్‌కు చెందిన తేజ నిడమనూరు 41 పరుగులతో అత్యధిక స్కోరర్‌గా నాటౌట్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలర్లు బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించడంతో నెదర్లాండ్స్‌పై ఇంగ్లీష్ జట్టు విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తలో మూడు వికెట్లు పడగొట్టగా.. డేవిడ్ విల్లే రెండు వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు. బెన్ స్టోక్స్ తన అద్భుతమైన సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు.