Minister KTR: సంక్రాంతి రాగానే గంగిరెద్దు వాళ్ళు వచ్చినట్టు సంగారెడ్డికి కొత్త వ్యక్తులు వస్తారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఏవేవో హామీలు ఇస్తారని.. మాయమాటలు నమ్మొద్దన్నారు. సంగారెడ్డిలోని గంజి మైదాన్‌లో జరిగిన బీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పీకిందని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కరెంట్ ఇవ్వకపోతే రైతులు సబ్ స్టేషన్ ముందు ధర్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. మనకి కరెంట్ కావాలా..? కాంగ్రెస్ కావాలా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ అంటే దొంగరాత్రి కరెంట్ అంటూ ఆయన మండిపడ్డారు.
Also Read: Janasena: జనసేన అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన పవన్‌కళ్యాణ్
కాంగ్రెస్ వాళ్లు ఒక్క చాన్స్ అంటూ బతిలాడుతున్నారని.. 11 సార్లు ఇస్తే ఏం చేశారని మంత్రి ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ వచ్చి బీజేపీకి కేసీఆర్ బీ టీం అంటారని.. బెంగాల్ పోయి దీదీ బీజేపీకి బీ టీం అంటారని.. ఢిల్లీకిపోయి కేజ్రీవాల్‌ని బీజేపీకి బీ టీం అంటారని కేటీఆర్ చెప్పారు. బీజేపీతో కేసీఆర్ ఎప్పటికీ కలవరని.. మాది సెక్యులర్ పార్టీ అని మంత్రి తెలిపారు. మేము బీజేపీకి బీ టీం అయితే మైనారిటీల కోసం ఎందుకు సంక్షేమ పథకాలు పెడుతామని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలవి అసత్య ఆరోపణలు అంటూ కొట్టిపారేశారు. ప్రధాని మోడీ వచ్చి కాంగ్రెస్‌తో కేసీఆర్ కలిశారు అని చెబుతారని.. రాహుల్ గాంధీ వచ్చి బీజేపీతో కేసీఆర్ తో కలిశారు అని చెబుతారని ఆయన పేర్కొన్నారు. కవితని అరెస్ట్ చేయలేదని బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటే అంటారని ఆయన ఎద్దేవా చేశారు. మరి సోనియా, రాహుల్ గాంధీలను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
Also Read: PM Modi: ఈ నెల 11 న రాష్ట్రానికి మరోసారి ప్రధాని మోడీ
జగ్గారెడ్డి తాను కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తా అని ప్రచారం చేస్తున్నాడట.. అలా చేస్తే చింతా ప్రభాకర్ గెలుపు కోసం తాను ఎందుకు వస్తా అని ఆయన అన్నారు. సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి చెప్పాడని.. డీకే శివకుమార్ 5 గంటలు కరెంట్ ఇస్తున్నామని చెబుతున్నాడని.. రేవంత్‌కి కరెంట్ కనపడటం లేదట మాకు సవాల్ విసిరారని కేటీఆర్ చెప్పారు. రేవంత్, జగ్గారెడ్డికి రెండు బస్సులు పెడుతా, దమ్ బిర్యానీ పెడుతా తిని వెళ్లి కరెంట్ తీగలు పట్టుకుని చూడండంటూ కేటీఆర్ సవాల్ విసిరారు. కరెంట్ ఉంటే మీరే పోతారు…పీడ పోతదంటూ మంత్రి కేటీఆర్ అన్నారు. బక్క పలుచటి కేసీఆర్‌ని ఎదుర్కోవడానికి షేర్లు, బబ్బర్ షేర్లు, తీస్ మార్ ఖాన్‌లు వస్తున్నారని.. ఎంత మంది వచ్చినా సరే సింహం సింహం సింగిల్‌గా వస్తుందన్నారు మంత్రి కేటీఆర్.