Telangana BJP Chief Bandi Sanjay Addressed at BJP Bhari Bahiranga Sabha.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పాదయాత్ర రెండు విడతలు పూర్తికాగా నేడు మూడో విడత పాదయాత్రను యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన బీజేపీ భారీ బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ ఎక్కడుంది అని అడిగిన వాళ్ళకి పాలమూరులో ఎక్కడుందో చూపించామని, నెక్స్ట్ ఖమ్మంలో కూడా చూపిస్తామన్నారు. అంతేకాకుండా.. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధి నుంచి ప్రారంభమైందని,జఫర్ సన్ స్క్రాచ్ మందు కోసమే కేసీఆర్ ఢిల్లీకి పోయిండంటూ ఆయన విమర్శించారు. గజేంద్ర సింగ్ గారు తెలంగాణకు వచ్చే షెడ్యూల్ అనేది 3 రోజుల ముందే తెలిసింది. కేసీఆర్ షెడ్యూల్ అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. తెలంగాణలో గొల్లకొండ కోటపై కాషాయ జెండా ఎగరేసాక సీఎం ఎవరైనా సరే… మొట్టమొదట దర్శించుకునేది పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారినే. ప్రతి బీజేపీ కార్యకర్త… శ్రీ లక్ష్మీనరసింహ స్వామి అవతారం ఎత్తి కేసీఆర్ ను తరిమికొట్టాలి. ఉద్యమాల గడ్డ నల్గొండ జిల్లా. 3వ విడత పాదయాత్ర అంటే కేసీఆర్ భయపడుతున్నాడు. యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో కేసీఆర్ నాణ్యత లేని పనులు చేయించాడు.
తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. బుక్కెడు బువ్వకోసం IIIT, గురుకుల పాఠశాల విద్యార్థులు ఏడుస్తున్నారు. గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారు. అదే అన్నం కేసీఆర్ మనుమడు తింటుండా?ఇక్కడ పీకనోడు, ఢిల్లీ పోయి పీకుతాడా? రైతు రుణమాఫీ ఏమైంది? దళితులకు 3 ఎకరాల భూమి, రైతు బంధు ఎంతమందికి వచ్చింది? వాసాలమర్రిలో 100 హామీలిచ్చి, ఒక్క హామీ నెరవేర్చలేదు. యాదాద్రిలో బీజేపీ బహిరంగసభ అనేసరికి, చేనేత బీమా అని ప్రకటించారు. కేసీఆర్ చేతకాని, మూర్ఖపు పాలన వలన 2000 మంది చేనేత కార్మికులు మరణించారు. మరణించిన చేనేత కార్మికులు అందరికీ చేనేత బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 4 లక్షల కోట్ల అప్పుచేసి, జనం చేతికి చిప్ప ఇచ్చిండు. SC, ST, BC వర్గాలతో పాటు అగ్రకులాలలోని పేదలను మోసం చేస్తున్నాడు, ST రిజర్వేషన్ విషయంలో ఎస్టీలను మోసం చేస్తున్న పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ. తెలంగాణలో డ్రగ్స్ మాఫియా, క్యాసినో అన్నింటిలో ఉన్నది టీఆర్‌ఎస్ నేతలే, నయూం వ్యవహారంలో స్వాధీనం చేసుకున్న పేపర్లు, డబ్బు ఏమైందో కేసీఆర్ సమాధానం చెప్పాలి.
బీజేపీ ప్రభుత్వం వచ్చాక అన్నీ కక్కిస్తాం. ప్రణాళిక లేకుండా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ తో లక్షల ఎకరాల మునుగుతున్నాయి. పంపు హౌస్లు మునిగాయి. ఏ మొహం పెట్టుకొని అలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడుగుతున్నారు? మొదటి విడత పాదయాత్రలో బీజేపీ అధికారంలోకి వస్తే… ఉచిత విద్య, వైద్యం అందిస్తాం అని హామీ ఇచ్చాం. 2వ విడత పాదయాత్రలో… ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు అమలు చేస్తాం అని హామీ ఇచ్చాం. కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న విషయాలను ప్రజలకు చెప్పేందుకే… ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మూడో విడత పాదయాత్ర చేస్తున్నాం. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి, బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాం. తెలంగాణ సమాజం బీజేపీ కి అండగా ఉంది. ఉద్యోగస్తులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు బయటికి రండి… భయపడకండి..బీజేపీకి మద్దతు ఇవ్వండి. గడీల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధవిముక్తిరాలిని చేయాలంటే… బీజేపీ అధికారంలోకి రావాలి. అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.