APL 2025 Auction Teams and Players Price: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) 2025 వేలం విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో సోమవారం జరిగింది. వేలంలో ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏసీఏ ఉపాధ్యక్షుడు పివిఆర్ ప్రశాంత్, గ్రౌండ్ డెవలప్‌మెంట్ జీఎం ఎంఎస్ కుమార్, కౌన్సిలర్ దంతు విష్ణు తేజ్ సహా ఏడు జట్ల యాజమానులు పాల్గొన్నారు. వేలంలో విశాఖకు చెందిన పైలా అవినాష్ అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ యాజమాన్యం రూ.11.05 లక్షలకు అవినాష్‌ను కొనుగోలు చేసింది.
సింహాద్రి వైజాగ్ లయన్స్ ప్రాంచైజీ రిక్కీ భుయ్‌ని రూ.10.26 లక్షలకు కైవసం చేసుకుంది. గిరినాథ్ రెడ్డిని రూ.10.05 లక్షలకు రాయల్స్ ఆఫ్ రాయలసీమ దక్కించుకుంది. టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డిని భీమవరం బుల్స్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.భారత్ టెస్ట్ ప్లేయర్ హనుమ విహారిని అమరావతి రాయల్స్ రూ.10 లక్షలకు తీసుకుంది. మరో టీమిండియా ఆటగాడు కెఎస్ భరత్‌ను కాకినాడ కింగ్స్ జట్లు రూ.10 లక్షలకు దక్కించుకుంది. రాయల్స్ ఆఫ్ రాయలసీమ టీమ్ షేక్ రషీద్‌ను 10 లక్షలకే కైవసం చేసుకుంది.
Also Read: Ben Stokes: అతడు ఉంటే మ్యాచ్‌ను లాగేసుకునేవాడు.. లక్కీగా ఆర్చర్ బుట్టలో వేశాడు!
ఇంతకుముందు ఏపీఎల్ ఫ్రాంఛైజీల పర్స్ వాల్యూ రూ.75 లక్షలుగా ఉండగా.. ఇప్పుడు రూ.2 కోట్లకు పెంచారు. ఏపీఎల్ సీజన్ 4 మ్యాచ్‌లు ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానున్నాయి. మ్యాచ్‌లు అన్ని విశాఖ వేదికగానే జరగనున్నాయి. సీజన్ 4లో 21 లీగ్‌లు, 4 ప్లేఆఫ్స్‌తో కలిపి మొత్తంగా 25 మ్యాచ్‌లు ఉన్నాయి. అమరావతి రాయల్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, విజయవాడ సన్ షైనర్స్, తుంగభద్ర వారియర్స్, కాకినాడ కింగ్స్, సింహాద్రి వైజాగ్ వారియర్స్, భీమవరం బుల్స్ టీమ్స్ తలపడనున్నాయి.