లార్డ్స్ టెస్ట్ విజయంపై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ సంతోషం వ్యక్తం చేశాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన బౌలింగ్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడన్నాడని ప్రశంసించాడు. చివరి రోజు ఉదయం ఆర్చర్ ఎదో మాయ చేస్తాడని తాను అనుకున్నా అని, అనుకున్నట్లే రెండు వికెట్స్ పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడని పేర్కొన్నాడు. భారత్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ డేంజరస్ బ్యాటర్ అని, రెండు ఇన్నింగ్స్‌ల్లో అతడిని త్వరగా ఔట్ చేయడంతోనే విజయం సాధించామని చెప్పాడు. నిజానికి తాను అలసిపోయాను అని, కానీ ఆట ఆడేలా చేసిందని స్టోక్స్ తెలిపాడు. లార్డ్స్‌లో టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లీష్ జట్టు 22 పరుగుల తేడాతో గెలుపొందింది.
మ్యాచ్ అనంతరం ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ… ‘ఇది గొప్ప విజయం. ఈరోజు ఉదయం ఆర్చర్, నేను కలిసి బౌలింగ్ చేయడనికి ఓ కారణం ఉంది. 6 ఏళ్ల క్రితం ఇదే రోజు లార్డ్స్‌లో వన్డే ప్రపంచకప్ 2019 గెలిచాం. ఆ మ్యాచ్‌లో ఆర్చర్ కీలక పాత్ర పోషించాడు. అందుకే ఈ రోజు ఆర్చర్ ఎదో మాయ చేస్తాడనుకున్నా. అనుకున్నట్లే రెండు వికెట్స్ పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఆర్చర్‌తో ఫస్ట్ స్పెల్ వేయించడం వెనక డ్రెస్సింగ్ రూమ్‌లో చర్చ జరిగింది. కార్స్ నిన్న అద్భుతమైన స్పెల్ వేశాడు. అతను వేగంగా బౌలింగ్ చేస్తున్నాడు, గొప్ప లయను కలిగి ఉన్నాడు. కానీ ఆర్చర్‌కు బంతిని ఇవ్వాలని నాకు అనిపించింది. రీఎంట్రీలో తొలి మ్యాచ్లో అదరగొడతాడని అనిపించింది. కీలకమైన వికెట్లు పడగొట్టాడు. దేశం కోసం టెస్ట్ మ్యాచ్ గెలవడం కంటే మించింది మరొకటి లేదనే భావనతో బౌలింగ్ చేశాను’ అని చెప్పాడు.
Also Read: Ravindra Jadeja: చరిత్ర సృష్టించిన జడేజా.. 93 ఏళ్ల తర్వాత..!
‘షోయబ్ బషీర్ గాయంతోనే బ్యాటింగ్ చేశాడు. అంతేకాదు బౌలింగ్ చేసి చివరి వికెట్ పడగొట్టాడు. అతడు సూపర్, పోరాట యోధుడు. నిన్నటితో పోల్చితే ఈ రోజు ఆట కాస్త భిన్న. నాలుగోరోజు ఎక్కువ సేపు మైదానంలో ఉండాల్సి వచ్చింది. నిజాయితీగా చెప్పాలంటే నేను బాగా అలసిపోయాను కానీ.. ఆట నన్ను ఆడేలా చేసింది. నేను ఆల్‌రౌండర్‌ను కాబట్టి మ్యాచ్‌ను ప్రభావం చేసేందుకు నాకు నాలుగు అవకాశాలు ఉంటాయి. ఆల్‌రౌండర్లకు కలిసొచ్చే గొప్ప విషయం ఇదే. ఒక విభాగంలో విఫలమైతే.. మరో విభాగంలో రాణించొచ్చు. కీలకమైన స్పెల్ వేశాను. నా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉంది. ఇక రిషబ్ పంత్ ఎంత ప్రమాదకరమైనవాడో మనందరికీ తెలుసు. అతడు రెండు రెండు ఇన్నింగ్స్‌ల్లో తర్వగా అవుట్ అవ్వడం కలిసొచ్చింది. పంత్‌ను రనౌట్ చేయడం టర్నింగ్ పాయింట్. రెండు టాప్ జట్లు తలపడినప్పుడు మ్యాచ్‌లు ఇలానే రసవత్తరంగా ఉంటాయి. నిజం చెబుతున్నా.. నాలుగు రోజులు హాయిగా నిద్రపోతా. విశ్రాంతి అనంతరం మాంచెస్టర్ టెస్ట్‌కు సిద్దమవుతా’ అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.