Gudivada Amarnath: టీడీపీ రాజకీయం కోసం పరిశ్రమల సదస్సులు నిర్వహించిందని.. వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం సమ్మిట్ నిర్వహిస్తోందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడుల నుంచి తమ టార్గెట్ ప్రారంభం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి ద్వైపాక్షిక సమావేశాలు ఈ రెండు రోజుల్లోనే కాకుండా తర్వాత కూడా కొనసాగుతాయన్నారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాన్నారు. ఆంధ్ర భోజనం రుచులు చూపించనున్నామని ఈ సందర్భంగా వెల్లడించారు. రాయలసీమ రాగి సంకటి, నాటుకోడి, గుంటూరు గోంగూర పచ్చడి వంటి ఆంధ్రా వంటకాలు మెనూలో ఉండనున్నాయన్నారు. భోజన ఏర్పాట్ల పై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అమర్నాథ్ వెల్లడించారు.చంద్రబాబు చేస్తున్న విమర్శలకు హెరిటేజ్ పరిశ్రమ రాష్ట్రంలో లాభదాయకంగా కొనసాగుతూ ఉండటమే సమాధానమని ఆయన అన్నారు. రాష్ట్రౌలో వివిధ రంగాల్లో పారిశ్రామిక, పెట్టుబడి పెట్టే అవకాశాలు వివరించటానికి ప్రయత్నిస్తామని తెలిపారు.
రాజధానిగా విశాఖ
గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ముఖ్యమంత్రి కూడా పారిశ్రామికవేత్తలు విడిది చేసే హోటల్‌లోనే బస చేయనున్నారని మంత్రి తెలిపారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు వేదిక అవుతున్న విశాఖపట్నం ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక ఈవెంట్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు వేదికైన సంగతి తెలిసిందే. 12 వేల మంది ఇప్పటి వరకు ఈ సమ్మిట్‌లో పాల్గొనేందుకు రిజిస్టర్ చేసుకున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. సిటీలో బ్యూటీఫికేషన్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు. రోడ్ల మరమ్మతులు, ఎలక్ట్రీషియన్ పనులు పూర్తి అయ్యాయన్నారు. విశాఖ రాష్ట్ర రాజధాని అని ముఖ్యమంత్రి ఢిల్లీ సమావేశంలో స్పష్టం చేశారన్నారు. హోటల్స్‌లో దాదాపు వెయ్యి రూములు రిజర్వ్ అయ్యాయన్నారు. ఇవన్నీ సదస్సుల కోసం చేస్తున్న తాత్కాలిక ఏర్పాట్లు కావన్నారు. విశాఖను రాష్ట్ర రాజధానిగానే ప్రొజెక్ట్ చేస్తామని మంత్రి చెప్పారు.
అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుంది..
ముఖ్యమంత్రి, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పారిశ్రామికవేత్తలు వస్తున్న నేపథ్యంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని విశాఖ సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. 2,500 మందితో భద్రత కల్పిస్తున్నామన్నారు. ప్రధాన వేదిక ప్రాంగణం అంతా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని సీపీ తెలిపారు. కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. వీఐపీలు బస చేసే హోటల్స్, ప్రయాణించే మార్గాలు అన్నీ పూర్తి స్థాయి భద్రతలో ఉంటాయన్నారు.