Purandeshwari: విజయవాడలో శక్తి కేంద్ర ప్రముఖులు, బూత్ అధ్యక్షులతో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా సమావేశం జరిగింది. ముఖ్య అతిధిగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి హాజరయ్యారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతం కోసం కార్యకర్తల అభిప్రాయాల మేరకు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నానని ఆమె వెల్లడించారు. పార్టీ పునాది బాగుంటే గాలి అనే మాట ఉండదు.. ఏ పార్టీ వైపు గాలి వీచినా మనం ఎంత బలంగా ఉన్నామో తెలుస్తుందన్నారు.
Also Read: AP Ministers: పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యం..
హోం మంత్రి వనిత వేధింపులతో ఓ ఎస్సీ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని.. సామాజిక బస్సు యాత్ర వైసీపీ చేపడుతోందని.. మరి ఆ కుర్రోడికి సామాజికంగా ఏం చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రజల్లో రాజకీయ పార్టీలు ఒక అపోహ సృష్టించారని.. ఆ సమయంలో బీజేపీని దోషిగా చూపించడంలో సఫలమయ్యారని మండిపడ్డారు. కేంద్రం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నా తమ సొంత పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆమె విమర్శించారు. అమరావతి రాజధాని అని బీజేపీ కట్టుబడి ఉందన్నారు. విజయవాడలో అండర్ గ్రౌండ్ డ్రైనేజికి, రోడ్లకు 500 కోట్ల రూపాయలు కేంద్రం కేటాయించిందన్నారు. రాజధానిలో మౌళిక సదుపాయాల కోసం కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయించిందని ఆమె చెప్పారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసపాలన సాగుతోందన్నారు.
రాజమండ్రిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు యధేచ్చగా జరుగుతున్నాయని.. రైతులు గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు. నోరు విప్పితే సమాధానం చెప్పరు కాని వ్యక్తి గత ధూషణలకు దిగుతూ ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వాళ్లంతా ప్రతి సబ్జెక్టుపై అవగాహన కలిగి ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెల్లడించారు.