AP Ministers: ఆంధ్రప్రదేశ్‌లో ప్రజలంతా జనం వెంటే ఉన్నారని మంత్రులు మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి నాగేశ్వర రావు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. గతంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్లకు మాత్రమే మంచి చేసుకునేవారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. జగన్ అందిస్తున్న పథకాలను చూశాక చంద్రబాబు ఎంత దోచుకు తిన్నారో ప్రజలు అర్థం చేసుకున్నారని ఆయన విమర్శించారు. జగన్‌కు వ్యతిరేక ఓటు ఎక్కడా లేదన్న ఆయన.. పేదరికాన్ని తరిమి కొట్టాలనేదే జగన్ లక్ష్యమన్నారు.
Also Read: Purandeswari: కంపెనీ పేరు లేకుండా బిల్స్.. అక్రమంగా ఇసుక తవ్వకాలు..!
పేదల ఆరోగ్యం, చదువుకి సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇచ్చారని మంత్రి మేరుగ నాగార్జున చెప్పారు. కులాల స్థితిగతులు మెరుగు పడ్డాయని అంటే సీఎం జగన్ కారణమన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి సీఎంగా జగన్ అవసరమని.. ఎంత మంది కలసి వచ్చినా జగన్‌ను ఎలా కాపాడుకోవాలి అనేది ప్రజలు ఆలోచిస్తున్నారన్నారు.
సామాజిక సాధికారత అంటే చంద్రబాబు దృష్టిలో ఆయన కులాన్ని మాత్రమే ఉద్ధరించడమని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శలు గుప్పించారు. ఎస్సీలు, బీసీలను బానిసలుగా చూడాలనే భావజాలం చంద్రబాబుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాజ్యాంగ నిర్మాత కోరుకున్న విధంగా అన్ని రంగాల్లోనూ అన్ని కులాలకు ప్రాధాన్యత సీఎం జగన్ కల్పిస్తున్నారని మంత్రి చెప్పారు. చంద్రబాబు దృష్టిలో బీసీలంటే ఓట్లు వేసేవాళ్ళు మాత్రమేనని ఆయన మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ రాగానే టీడీపీలో అచ్చెన్నాయుడిని పక్కకి తోసేశారని మంత్రి చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో బీసీలకే ప్రధానమైన మంత్రి పదవులు దక్కాయన్నారు. జగన్ వెంట జనం ఉన్నారన్న మంత్రి.. అబద్ధపు చంద్రబాబును ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.