Maharashtra: రాష్ట్ర మంత్రివర్గంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ చేరిక తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న వివిధ పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య ప్రాథమికంగా 200కి చేరుకోవడంతో గత 51 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఒక ప్రత్యేక దృశ్యం ఆవిష్కృతమైంది. 1972లో చివరిసారిగా 200 మందికి పైగా ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉండగా, ఆ సమయంలో మొత్తం 222 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందినవారే. అలాగే ఆ సమయంలో సభ బలం 270 అని రాష్ట్ర శాసనసభ మాజీ అధికారి సోమవారం తెలిపారు. ఆదివారం ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల ఖచ్చితమైన సంఖ్య ఇంకా తెలియరాలేదు.
అయితే, అజిత్ పవార్ విధేయుడు, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ 36 (53 మందిలో) ఎమ్మెల్యేల మద్దతును ప్రకటించారు. “ఎక్కువ మంది ఎమ్మెల్యేలు అజిత్ పవార్‌కు మద్దతు ఇస్తున్నారు. మేము ఇప్పటికీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో భాగమే. మేము ఫిరాయించలేదు” అని మిత్కారీ పేర్కొన్నారు. 36 మంది శాసనసభ్యుల మద్దతుపై మిత్కారీ వాదనను ముఖవిలువగా తీసుకుంటే, శివసేన, బీజేపీతో సహా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య 181కి చేరుకుంది.
Also Read: Boat Capsized: పడవ పోటీల్లో అపశృతి.. 25 మంది మహిళలతో వెళ్తున్న బోటు బోల్తా
288 మంది సభ్యుల సభలో, బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 40 మంది ఉన్నారు. షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి బహుజన్ వికాస్ అఘాడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన ఇద్దరు, 13 మంది స్వతంత్రులు కూడా మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రీయ సమాజ్ పార్టీ, జన్ సురాజ్య శక్రి పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యేలు కూడా మద్దతు ఇస్తున్నారు. మొత్తంగా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య 201కి చేరింది.
“1990 నుంచి 288 మంది సభ్యుల శాసనసభలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా 145 సీట్లు (మెజారిటీ మార్క్) గెలుచుకోలేకపోయింది. 1972 లో దిగువ సభ మొత్తం బలం 270 ఉన్నప్పుడు కాంగ్రెస్ 222 సీట్లు గెలుచుకుంది,” అని మహారాష్ట్ర విధాన్ భవన్ ప్రధాన కార్యదర్శి అనంత్ కల్సే చెప్పారు. 1978 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సభ బలం 288కి పెరిగింది. 1980లో కాంగ్రెస్ 186 సీట్లు, 1985లో 161 సీట్లు గెలుచుకుంది. చాలా గ్యాప్ తర్వాత, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో 122 సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దశకు చేరుకుంది. కానీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ తన పనితీరును పునరావృతం చేయలేకపోయింది. 105 సీట్లతో సరిపెట్టుకుంది.