తింటే గారెలే తినాలి… వింటే భారతమే వినాలి అంటుంటారు. అలాగే ఇండియాలో పౌరాణిక చిత్రాలు తీయటంలో తెలుగువారిదే పైచేయి అనేది వాస్తవ విషయం. దీనికి మహానటుడు యన్టీఆర్ నటనావైభవం ఓ కారణం కాగా, దర్శకుల ప్రతిభ కూడా మరో కారణమని చెప్పవచ్చు. ఇప్పుడు ‘ఆదిపురుష్’ ఆగమనంతో మళ్ళీ సినీ జనం పురాణగాథలపై మనసు పారేసుకుంటున్నారు. ఒకే సమయంలో రామాయణంపై పలువురు దృష్టి సారించడం విశేషంగా మారింది. మన స్టార్ హీరో ప్రభాస్ శ్రీరామునిగా ‘ఆదిపురుష్’ తెరకెక్కింది. ఉత్తరాదివారిదే ఈ చిత్ర నిర్మాణంలో ప్రధాన పాత్ర అయినా, ప్రభాస్ కారణంగా ‘ఆదిపురుష్’ తెలుగులోనూ సందడి చేయబోతోంది. ఓమ్ రౌత్ దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిపురుష్’ జూన్ 16న జనం ముందుకు రానుంది.
Also Read : Ravi Teja: ప్రభాస్, మహేశ్ తో రవితేజ సంక్రాంతి వార్
ఇదే సమయంలో హిందీలో రామాయణం ఆధారంగా మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తూ ఉండడం విశేషం. వాటిలో ముందుగా రణబీర్ కపూర్ రామునిగా నటిస్తోన్న ‘రామాయణ్’ ను గుర్తు చేసుకోవాలి. నితీశ్ తివారీ దర్శకత్వంలో మన తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్, మధు మంతెన కలసి నిర్మిస్తున్న ‘రామాయణ్’లో తొలుత దీపికా పదుకొనేను సీతగా అనుకున్నారు. కానీ, ఇప్పుడు సీత పాత్రలో రణబీర్ కపూర్ రియల్ లైఫ్ హీరోయిన్ అలియా భట్ నటిస్తోందట. అలాగే నితీశ్ తివారీ ‘రామాయణ్’లో రావణ పాత్రకు ముందు హృతిక్ రోషన్ ను అనుకున్నారు. అయితే హృతిక్ ఆ పాత్ర పోషించనని చెప్పాడు. దాంతో ‘రామాయణ్’లో రావణునిగా ‘కేజీఎఫ్ ఫేమ్’ యశ్ ను ఎంచుకున్నట్లు వినికిడి.
Also Read : Guntur Kaaram: సినిమాలో అదిరిపోయిన శ్రీలీల లుక్…!!
ఇదిలా ఉంటే, ‘సీతా ద ఇన్ కార్నేషన్’ అనే చిత్రాన్ని అలౌకిక్ దేశాయ్ తెరకెక్కిస్తున్నారు. ఇందులో కంగనా రనౌత్ సీత పాత్రను ధరిస్తోంది. ఈసినిమాకు మన తెలుగు రచయిత విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్ సమకూర్చారు. ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే కంగనా రనౌత్, ‘రామాయణ్’లో సీత పాత్రలో అలియా భట్ నటిస్తోందని తెలియగానే ఆ సినిమాపై కామెంట్స్ చేసింది. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఆ రెండు సినిమాలు విడుదల కాకముందే ప్రభాస్ ‘ఆదిపురుష్’ జనాన్ని పలకరిస్తోంది. ఈ సినిమా ఫలితం కోసం మిగిలిన రామాయణ గాథలు తీసేవారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఎవరికి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.