అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో సుమారు 1200 మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా వారు నిర్వహిస్తున్న ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా వాలంటీర్లను విధుల నుండి తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే వాలంటీర్లంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెయ్యాలంటే వారు స్వయంగా రంగం లోకి దిగాల్సిందేనని తీర్మానించుకుని ఈ రాజీనామా అస్త్రాలు సంధిస్తున్నారు. రాజీనామాలు అనంతరం వీరంతా పార్టీ కార్యకర్తల్లా మారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలను వాటి ఫలాలను ప్రజలకు వివరించి తద్వారా వారి ఓట్ల ను జగన్మోహన్ రెడ్డికి వేసేలా వీరు కృషి చేయనున్నారు.
ఇదిలా ఉండగా ఈ దావేశం పై కొందరు సీ విజిల్ యాప్ ద్వారా పిర్యాదు చేయడంతో ఎన్నికల అధికారులు ఐదంరాజు, అర్బన్ మోడల్ కోడ్ కాంటాక్ట్ ఇంచార్జ్ తాతపూడి కనకరాజులు సూర్య ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న సభలో వారు తనిఖీలు నిర్వహించారు. మండపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ముమ్మిడివరపు బాపిరాజు మాట్లాడుతూ తమ దగ్గర సభకు సంబంధించిన అనుమతులు ఉన్నాయని ఇది కేవలం పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదని వాలంటీర్ల ఆత్మీయ కలయిక మాత్రమేనని, ఏటువంటి పార్టీ జెండాలు ఉపయోగించలేదని తెలపడంతో పాటు సంబంధిత మున్సిపల్ అధికారులు ఇచ్చినటువంటి అనుపతి పత్రాలు చూపించడంతో వారు వెనుతిరిగారు. ఇదిలా ఉండగా విలేకరులకు సైతం కార్యక్రమం చివరి దశకు చేరుకున్న సమయంలో ఫోన్ చేసి సమాచారం అందించడం ఆసక్తికరంగా మారింది.