Women Soldiers: మహిళా సైనికులకు కేంద్ర గుడ్‌న్యూస్ చెప్పింది. మహిళా సైనికులకు, నావికులకు, వైమానిక దళాల్లో పనిచేసే మహిళలకు వారి అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ, పిల్లల దత్తత సెలవులకు కేంద్రం ఓకే చెప్పింది. సెలవులు మంజూరు చేసే ప్రతిపాదనకరు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. ర్యాంకులో సంబంధం లేకుండా సాయుధ దళాల్లోని మహిళలందరిని సమానంగా చూడాలనే దానికి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
ఈ నిర్ణయం వల్ల సైన్యంలోని మహిళలకు పని పరిస్థితులను మెరుగుపరుస్తుందని, ఇది వారి వృత్తి, కుటుంబ జీవితాలను మెరుగైన రీతిలో సమన్వయం చేయడంతో సాయపడుతుందని మంత్రిత్వశాఖ పేర్కొంది. మిలిటరీలో మహిళలందరికీ అలాంటి సెలవును మంజూరు చేయడంలో అధికారి అయిన మరేదైనా ర్యాంకు అయిన సమానంగా వర్తిస్తుందని మంత్రిత్వశాఖ తెలిపింది.
ప్రస్తుతం మహిళా అధికారులు గరిష్టంగా ఇద్దరు పిల్లలకు లోబడి ప్రతీ బిడ్డకు పూర్తి వేతనంతో పాటు 180 రోజుల ప్రసూతి సెలవులు పొందుతారు. మొత్తం సర్వీస్ కెరీర్‌లో 360 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్(పిల్లల వయసు 18 ఏళ్ల కన్నా తక్కువగా ఉన్నట్లయితే) మంజూరు చేయబడుతుంది. ఒక ఏడాది లోపు వయసున్న పిల్లల్ని దత్తత తీసుకుంటే, దత్తత తేదీ నుంచి 180 రోజలు సెలవులు మంజూరు చేయబడుతాయి.
సెలవుల నిబంధనల పొడగింపు మహిళలు కుటుంబ, సామాజిక సమస్యలను సమర్థవంతంగా పరిస్కరించుకోవడంలో సాయపడుతుందని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. నారీశక్తిని ఉపయోగించుకోవడంలో నరేంద్రమోడీ ప్రభుత్వ నిబద్ధతకు ఇది అద్దం పడుతుందని పేర్కొంది. మహిళా అగ్నివీర్‌ల నియామకం సాయుధ దళాల సాధికారతను పెంపొందిస్తుందని పేర్కొంది.