Allahabad HC: భార్య మద్యం సేవిస్తుందని ఆరోపించిన భర్తకు విడాకులు ఇవ్వడానికి ఉద్దేశించబడిన కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవిత భాగస్వామి మద్యం సేవించడం హిందూ వివాహ చట్టం-1955 ప్రకారం, వివాహాన్ని రద్దు చేసేంత క్రూరత్వం కాదని చెప్పింది. తన భార్య క్రూరత్వం కారణంగా విడాకుల కోసం చేసుకున్న అభ్యర్థనను ఫ్యామిలీ కోర్టు తోసిపుచ్చింది, దీనిపై హైకోర్టులో అప్పీల్ చేసుకున్న సమయంలో ఈ తీర్పు వచ్చింది.
తన భార్య మద్యం సేవించిందని, ఇది మధ్యతరగతి సమాజం సాంస్కృతిక నిబంధనలకు అవమానకరమని, తనకు మానసిక వేదన కలిగించిందని భర్త వాదించాడు. అయితే, న్యాయమూర్తులు వివేక్ చౌదరి, ఓం ప్రకాష్ శుక్లాతో కూడిన ధర్మాసనం ఈ వాదనను తోసిపుచ్చింది. ‘‘అనవసరమైన, అనాగరిక ప్రవర్తన’’తో పాటు మద్యం సేవించే చర్యను క్రూరత్వంతో సమానంగా చూడలేమని న్యాయమూర్తులు చెప్పారు.
Read Also: Rangareddy: మరో ఘోరం.. ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం
మధ్య తరగతి కుటుంబాల్లో మద్యం సేవించడం నిషిద్దమని సామాజికంగా ఉన్న భావన ప్రబలంగా ఉన్నప్పటికీ, మద్యం సేవించడం అనే చర్య క్రూరత్వానికి సమానంగా లేదని కోర్టు వ్యాఖ్యానించింది. భార్య మద్యం సేవించడం వల్ల భర్తపై క్రూరత్వం ఎలా ఏర్పడిందనే దానిని చూపించడానికి సరైన వాదనలు లేవని కోర్టు పేర్కొంది. రుజువులు లేని ఆరోపణలు విడాకులకు ఆధారం కావని పేర్కొంది.
అయితే, భార్యభర్తలు నవంబర్ 16 నుంచి విడివిడిగా నివిస్తున్నట్లు కోర్టు గమనించింది. భార్య, భర్త నుంచి ఉద్దేశపూర్వకంగా ఎక్కువ కాలం దూరంగా ఉండటం ‘‘ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం’’ అని తేల్చింది. కోర్టు ఇద్దరి మధ్య దూరాన్ని హైలెట్ చేసింది. వారి వివాహం పనికిరానిదిగా, భావోద్వేగపరంగా అంతమైనదిగా పేర్కొంది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. ‘‘దీర్ఘకాలం నిరంతరం విడిపోయి ఉండటం, వివాహ బంధాన్ని పునరుద్ధరణకు కష్టం అని నిర్ధారిస్తుంది’’ అని కోర్టు పేర్కొంది. ఫలితంగా హైకోర్టు కుటుంబ కోర్టు తీర్పును పక్కన పెట్టి, భార్య దీర్ఘకాలంగా భర్తకి దూరంగా ఉండటం అనే కారణం చేత విడాకులను మంజూరు చేసింది.