Yediyurappa: 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో బీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(81) విచారణకు హాజరుకాకపోవడంతో బెంగళూర్ కోర్ట్ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అంతకుముందు బుధవారం కర్ణాటక పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సిఐడి) విచారణకు హాజరు కావాలని శ్రీ యడ్యూరప్పను కోరుతూ నోటీసు జారీ చేసింది. దీనిపై ఆయన కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ పొందేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది. తాను ఢిల్లీలో ఉన్నానని, విచారణ కోసం హాజరుకావడానికి మరింత గడవు కావాలని కోరారు.
Read Also: BS Yediyurappa: అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తాం: కర్ణాటక మినిస్టర్..
చీటింగ్ కేసులో సహాయం కోరేందుకు వెళ్లిన సమయంలో తన 17 ఏళ్ల కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాని మహిళ సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో మార్చిలో ఫిర్యాదు చేసింది. దీంతో యడియూరప్పపై లైంగిక వేధింపులు, పోక్సో చట్టం కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ కేసును సీఐడీ విచారిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు బుధవారం విచారణ కోసం నోటీసులు జారీ చేసింది. అయితే, యడ్యూరప్ప ఈ ఆరోపణలను ఖండించారు మరియు తాను న్యాయపరంగా పోరాడతానని చెప్పారు. విచారణకు సహకరిస్తానని సీఐడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ కేసుపై కర్ణాటక హోంమంత్రి జి. పరమేశ్వర మాట్లాడుతూ, అవసరమైతే యడియూరప్పను అరెస్ట్ చేస్తామని చెప్పారు.