ముంబైలో హీరోయిన్ ఊర్మిళ కొఠారే కారు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో మెట్రో ప్రాజెక్ట్‌లో పని చేస్తున్న కార్మికుడు మృతిచెందాడు. అతివేగంగా కారు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఊర్మిళా కొఠారే డ్రైవర్ కారును అత్యంత వేగంగా నడిపాడని పోలీసులు పేర్కొన్నారు.
నటి ఊర్మిళ కొఠారే శుక్రవారం రాత్రి షూటింగ్ ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్నారు. అయితే డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడు. పోయిసర్ మెట్రో స్టేషన్ సమీపంలో మెట్రో ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులను ఢీకొట్టింది. ఈ సంఘటన కండివలి తూర్పు దగ్గర అర్థరాత్రి 12.45 గంటలకు జరిగింది. అయితే సంఘటనాస్థలిలోనే ఒక కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో కార్మికుడు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అలాగే డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. హ్యుందాయ్ వెర్నా అనే కారు అత్యంత వేగంతో నడుస్తోందని, సరైన సమయంలో ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో ఊర్మిళ ప్రాణాపాయం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఊర్మిళ ఆస్పత్రిలో కోలుకుంటోంది. ర్యాష్ డ్రైవింగ్, నిర్లక్ష్యంతో కార్మికుడి మరణానికి కారణమైనందుకు డ్రైవర్‌పై సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే ప్రమాదం జరిగిన విషయం ఊర్మిళకు కూడా తెలియదు. ప్రమాదం జరిగిన సమయంలో ఊర్మిళ కారులో నిద్రపోతుంది. సడన్‌గా ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని భర్త ఆదినాథ్ కొఠారే తెలిపారు. లేదంటే ఆమె ప్రాణాలు పోయేవని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తు్న్నారు.
ఊర్మిళ… మరాఠీ టెలివిజన్, సినిమా నటి, క్లాసికల్ డాన్సర్. దునియాదారి, శుభ మంగళ్ సావధాన్, తి సద్ధ్యా కే కర్తే వంటి మరాఠీ సినిమాలు పేరు తెచ్చాయి. మాయికా, మేరా ససురల్ వంటి హిందీ టీవీ సీరియల్స్, అసంభవ్, ఉన్ పాస్, గోష్టా ఎకా లగ్నాచి వంటి మరాఠీ సీరియల్స్‌లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందింది. 2014లో వచ్చిన వెల్‌కమ్ ఒబామా సినిమాతో తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టింది. 2006లో ఊర్మిళ, ఆదినాథ్ కొఠారే ఇద్దరూ ఒకరినొకరు కలుసుకొని.. శుభ మంగళ్ సావధాన్ అనే మరాఠీ సినిమాలో కలిసి నటించారు. 2011లో వీరిద్దరి వివాహం జరిగింది. 2018లో వారికి ఒక పాప జన్మించింది.