ఉదయ్ పూర్ లో కన్హయ్య లాల్ దారుణ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మకు మద్దతుగా పోస్ట్ చేశాడనే కారణంగా ఇద్దరు మతోన్మాదులు అత్యంత పాశవికంగా కన్హయ్య లాల్ ను హత్య చేశారు. ఈ ఘటన రాజస్థాన్ లో ఉద్రిక్తతలకు దారి తీసింది. ఉదయ్ పూర్ తో సహా అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించడంతో పాటు ఇంటర్నెట్ బంద్ చేశారు.
అయితే 46 ఏళ్ల టైలర్ కన్హయ్య లాల్ శరీరంపై మొత్తం 26 గాయాలు ఉన్నట్లు తేలింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ తరహాలో నిందితులు హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీస్ అధికారులు వెల్లడించారు. బుధవారం కన్హయ్య లాల్ పోస్ట్ మార్టంలో ఈ విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయి. శరీరం లో మెడ, తల, చేయి, వీపు, ఛాతీపై గాయాలు ఉన్నట్లు సంబంధిత వర్గాల వల్ల తెలిసింది. హంతకులు, బాధితుడి తల నరికేందుకు ప్రయత్నించారు.. అయితే మెడ తెగిపోయినా..తల మాత్రం తెగలేదు.
కస్టమర్లుగా నటిస్తూ రియాజ్ అఖ్తరీ, గౌస్ మహ్మద్ టైలర్ కన్హయ్య లాల్ పై దాడి చేశారు. ఈ ఘటన ఉదయ్ పూరత్ లోని ధన్ మండీ ప్రాంతంలో చోటు చేసుకుంది. అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు. హత్యోదంతాన్ని సెల్ ఫోన్ లో షూట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే ఇద్దరు నిందితులను గంటలోపే పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితుల్లో ప్రధాన నిందితుడికి పాకిస్తాన్ లోని ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. ఈ కేసును ఎన్ఐఏతో పాటు రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ దారుణ హత్య ద్వారా మానవత్వం హద్దులను దాటిందని.. హంతకులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా శిక్షించాలని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలెట్ అన్నారు.