Doctor Rape-Murder Case: కోల్‌కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించిన కేసుని ఈ రోజు సుప్రీంకోర్టు విచారించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజ ఉదయం 10.30 గంటలకు ఈ కేసుని విచారిస్తుంది. చివరిసారిగా సెప్టెంబర్ 09న సుప్రీంకోర్టు ఈ కేసుని విచారించింది. ఆ సమయంలో మృతదేహాన్ని శవపరీక్ష కోసం అప్పగించిన సమయంలో ఇచ్చే పత్రాన్ని సమర్పించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరుపున వాదిస్తున్న కపిల్ సిబల్‌ని కోర్టు కోరింది. అయితే, ఈ పత్రం కనిపించకుండా పోయిందని, కొత్త సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఈ కీలక పత్రంలో పోస్టుమార్టం సమయంలో మృతదేహంపై ఎలాంటి బట్టలు, వస్తువులు ఉన్నాయనే వివరాలు ఉన్నందుకు ఇది చాలా ముఖ్యమని సీజేఐ చంద్రచూడ్ అన్నారు. మరో న్యాయమూర్తి జేబీ పార్దివాలా..‘‘ఈ పత్రం కనిపించకుండా పోయిందంటే, ఏదో తప్పు జరిగింది’’ అని అన్నారు. సెప్టెంబరు 9న, నిరసన తెలిపిన వైద్యులను మరుసటి రోజులోగా విధుల్లోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. నిరసన తెలిపిన వైద్యులు గడువులోగా విధుల్లో చేరితే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని కోర్టు హామీ ఇచ్చింది.
Read Also: Bandlaguda Jagir: ఏకంగా రూ.1.87 కోట్లు పలికిన బండ్లగూడ గణేష్ లడ్డూ..!
అయితే, కోల్‌కతా జూనియర్ వైద్యులు మాత్రం విధుల్లో చేరేందుకు నిరాకరించి ఆందోళన కొనసాగించారు. ఇది ప్రజా ఉద్యమం అనే విషయాన్ని ప్రభుత్వం, సుప్రీంకోర్టు మరచిపోకూడదని, తమ డిమాండ్లు నెరవేరే వరకు విధుల్లో చేరబోమని చెప్పారు. ఇదిలా ఉంటే, నిన్న సాయంత్ర బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో డాక్టర్లు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కోల్‌కతా కమిషనర్‌తో సహా ఇతర ఉన్నతాధికారుల్ని తొలగించేందుకు మమతా బెనర్జీ ఓకే చెప్పారు. కోల్‌కతా పోలీస్ చీఫ్ వినీత్ గోయల్ రాజీనామాకు అంగీకరించారని, ఉత్తరాది డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అభిషేక్ గుప్తాను కూడా తొలగిస్తారని ఆమె చెప్పారు. ఇద్దరు సీనియర్ ఆరోగ్య శాఖ అధికారులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.
సుప్రీంకోర్టు గత విచారణకు ఈ రోజు విచారణకు మధ్య ఆర్ జీ కర్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ పై సాక్ష్యాలు తారుమారు చేయడం, తాలా పోలీస్ స్టేషన్ అధికారి అభిజిత్ మోండల్‌ని అరెస్ట్ చేయడం జరిగాయి. వీరిద్దరు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు సీబీఐ విచారణలో తేలింది. నిందితుడు సంజయ్ రాయ్‌ని రక్షించేందుకు అభిజిత్ మోండల్ ప్రయత్నించాడని, ఘటన జరిగిందని తెలిసినా, గంట ఆలస్యంగా సంఘటనా స్థలానికి చేరుకున్నాడని సీబీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు 09న ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ సెమినార్ హాలులో 31 ఏళ్ల ట్రైనీ పీజీ వైద్యురాలి మృతదేహం అర్దనగ్నంగా కనిపించింది. సంజయ్ రాయ్ అనే నిందితుడు ఆమెపై అత్యాచారం జరిపి, హత్య చేశాడు.